భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నాడనే ఊహాగానాలు జోరందుకున్నాయి. షమీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాడు. ఉన్నట్టుండి జరిగిన ఈ సమావేశం ఇప్పుడు క్రీడా, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సమావేశంలో క్రీడారంగ అభివృద్ధి, యువ అథ్లెట్లను ప్రోత్సహించడం, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన యువత క్రీడల్లో ఎక్కువగా పాల్గొనేలా చేయడం వంటి పలు కీలక అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. దేశంలో ప్రతిభావంతులైన యువతకు క్రీడల్లో మెరుగైన అవకాశాలు కల్పించడం, వారి సాధికారత, ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. క్రీడల ద్వారా యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి గల మార్గాలపైనా చర్చించారు. ఈ భేటీలో బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు కున్వర్ బాసిత్ అలీ కూడా పాల్గొన్నారు. సమావేశానికి సంబంధించిన ఫొటోలను ఆయన తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

మహమ్మద్ షమీ ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 13 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో భారత్ తరఫున 64 టెస్టు మ్యాచ్‌లు ఆడిన షమీ 229 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ రెండు అర్ధ సెంచరీలతో 750 పరుగులు సాధించాడు. షమీ చివరిసారిగా జూన్ 2023లో భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడగా, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మార్చి 2025లో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.

వన్డేల్లో 108 మ్యాచ్‌ల్లో 206 వికెట్లు, 25 అంతర్జాతీయ టీ20లలో 27 వికెట్లు సాధించి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విషయానికి వస్తే, గతంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన షమీ, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి మారాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 132 మ్యాచ్‌లు ఆడిన షమీ ఖాతాలో 145 వికెట్లు ఉన్నాయి.

ఇదిలా ఉండగా, ఇటీవల భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ అతడిని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. తనకు బీజేపీ కుటుంబంలో సముచిత స్థానం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్‌లకు చాహల్ ధన్యవాదాలు తెలిపాడు. చాహల్ చేరిక జరిగిన కొద్ది రోజులకే మహమ్మద్ షమీ కూడా బీజేపీ అగ్రనేతను కలవడంతో, అతడు కూడా రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది.