పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ అగ్రనేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. డీలిమిటేషన్ (రెండవ) బిల్లు-2026, అలాగే 132వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026ల ప్రవేశం, సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌ సహా 30 మందికి పైగా కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. రేపటి నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్‌కు తప్పనిసరిగా హాజరై ప్రభుత్వ శాసన ఎజెండాకు మద్దతుగా ఓటు వేయాలని బీజేపీ తమ లోక్‌సభ సభ్యులకు మూడు లైన్ల విప్ జారీ చేసింది.

ప్రతిపాదిత బిల్లుల ప్రకారం, లోక్‌సభ గరిష్ఠ స్థానాల సంఖ్యను 543 నుంచి 850కి, అలాగే రాష్ట్రాల శాసనసభ స్థానాల పరిమితిని 650కి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 'నారీ శక్తి వందన్ అధినియమ్' అమలు సాధ్యమవుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది.