సమ్మె వేళ కస్టమర్లకు ఎస్‌బీఐ ఊరట.. మూడు రోజుల పాటు ఏ బ్యాంకు ఏటీఎం వాడినా చార్జీలుండవ్!

సమ్మె వేళ కస్టమర్లకు ఎస్‌బీఐ ఊరట.. మూడు రోజుల పాటు ఏ బ్యాంకు ఏటీఎం వాడినా చార్జీలుండవ్!

SBI relief for customers no ATM charges for three days during bank strike
  • సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె
  • సమ్మె రోజుల్లో ఏటీఎం లావాదేవీలపై చార్జీలను రద్దు చేసిన ఎస్‌బీఐ
  • ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా కస్టమర్లు ఉచితంగా సేవలు పొందవచ్చని ప్రకటన
  • డిజిటల్ సేవలు యథావిధిగా పనిచేస్తాయని, వాటిని వాడుకోవాలని సూచన
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ కస్టమర్లకు ఒక శుభవార్త అందించింది. ప్రతిపాదిత బ్యాంకుల సమ్మె జరగనున్న మూడు రోజుల పాటు ఏటీఎం లావాదేవీలపై ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మె కారణంగా వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఎస్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె జరిగే ఈ మూడు రోజుల్లో ఎస్‌బీఐ కస్టమర్లు దేశంలోని ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా ఇతర లావాదేవీలు జరపవచ్చు.

సమ్మె కాలంలో తమ బ్రాంచ్‌లు తెరిచే ఉంటాయని ఎస్‌బీఐ తెలిపినప్పటికీ, ఉద్యోగుల భాగస్వామ్యాన్ని బట్టి సేవలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల, అత్యవసరమైన బ్రాంచ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని ఖాతాదారులకు సూచించింది. నగదు అవసరాల కోసం ఏటీఎంలతో పాటు ఆటోమేటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్లు (ఏడీడ‌బ్ల్యూఎం) కూడా అందుబాటులో ఉంటాయని తెలియజేసింది.

అదే సమయంలో డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదని ఎస్‌బీఐ భరోసా ఇచ్చింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ సేవలు యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. సాధారణ చెల్లింపులు, నిధుల బదిలీ కోసం ఈ సేవలను వినియోగించుకోవాలని కోరింది. 

దీంతో పాటు కస్టమర్ సర్వీస్ పాయింట్లు (సీఎస్‌పీఎస్‌) కూడా కొన్ని రకాల సేవలను అందిస్తాయని వివరించింది. ఖాతాదారులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని తమ ఆర్థిక కార్యకలాపాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఎస్‌బీఐ విజ్ఞప్తి చేసింది.
Advertisement
SBI
Bank Strike
ATM Transaction Charges
United Forum of Bank Unions
Digital Banking Services
State Bank of India

More Telugu News