బైక్‌, కారు కొంటున్నారా? ఇన్సూరెన్స్‌పై కొత్త రూల్స్‌.. ఇక మీ ఇష్టం వచ్చిన చోటే!

బైక్‌, కారు కొంటున్నారా? ఇన్సూరెన్స్‌పై కొత్త రూల్స్‌.. ఇక మీ ఇష్టం వచ్చిన చోటే!

Buying a bike or car New insurance rules let you choose where to buy
  • మోటార్‌ వెహికల్‌ ఇన్సూరెన్స్‌పై ఐఆర్‌డీఏఐ కొత్త ప్రతిపాదనలు
  • డిజిటల్‌ ఇన్సూరెన్స్‌కు మరింత ప్రాధాన్యం
  • థర్డ్‌ పార్టీ పాలసీలపై కమిషన్‌ లేకుండా ప్రతిపాదన
  • ఓన్‌ డ్యామేజ్‌ కవర్లపై 5 శాతం పరిమితి ప్రతిపాదన
  • వేరే చోట పాలసీ తీసుకున్నా క్యాష్‌లెస్‌ రిపేర్‌
కొత్త వాహనం కొంటున్నారా? ఇప్పటివరకు షోరూమ్‌లోనే ఇన్సూరెన్స్‌ తీసుకోవడం చాలామందికి సాధారణం. ఇకపై మాత్రం మీకు మరిన్ని ఆప్షన్లు కనిపించే అవకాశం ఉంది. కొత్త వాహనాల మోటార్‌ ఇన్సూరెన్స్‌ విక్రయ విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ‘ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ (ఐఆర్‌డీఏఐ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

కొత్త వాహనం కొనేవారికి బీమా తీసుకునే డిజిటల్‌ ఆప్షన్‌ను షోరూమ్‌లోనే స్పష్టంగా చూపించాలని ఐఆర్‌డీఏఐ సూచించింది. ఇందుకోసం బీమా సుగమ్‌ వంటి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లకు వెళ్లేందుకు క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో షోరూమ్‌ సూచించే పాలసీతోనే ఆగిపోకుండా ఇతర మార్గాల్లోనూ బీమా తీసుకునే అవకాశం దక్కొచ్చు.

డీలర్ల కమిషన్‌పై కోత
కొత్త వాహనాల థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌పై డీలర్లకు కమిషన్‌ లేకుండా చేయాలని ప్రతిపాదించారు. ఓన్‌ డ్యామేజ్‌, ఇతర సంబంధిత కవర్లపై గరిష్ఠంగా 5 శాతం వరకు చెల్లింపులు ఉండేలా సూచించారు. టెక్నాలజీ, అవగాహన కార్యక్రమాల ఖర్చులను కూడా ఈ పరిమితిలోనే పరిగణించాలని ప్రతిపాదనలో ఉంది.

ప్రస్తుతం వాహనాల విక్రయం, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌, సర్వీసింగ్‌ వంటి సేవలు ఒకే చోట అందించే విధానం ఉంది. కొత్త మార్పులతో ఈ విధానంలో మార్పులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇతర చోట ఇన్సూరెన్స్‌ తీసుకున్నా..
మరో కీలక ప్రతిపాదన క్యాష్‌లెస్‌ రిపేర్‌కు సంబంధించినది. కస్టమర్‌ వేరే చోట ఇన్సూరెన్స్‌ తీసుకున్నాడనే కారణంతో డీలర్‌ క్యాష్‌లెస్‌ రిపేర్‌ సదుపాయాన్ని నిరాకరించకూడదని ఐఆర్‌డీఏఐ సూచించింది. తుది నిబంధనలు, పాలసీ షరతులకు లోబడి ఈ సదుపాయం అందుబాటులో ఉండొచ్చు.

ఎందుకు ఈ మార్పులు?
మోటార్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం 2022-23 నుంచి 2024-25 మధ్య సుమారు 34 శాతం పెరిగింది. ఇదే సమయంలో కమిషన్లు ఏకంగా 259 శాతం పెరిగాయని ఐఆర్‌డీఏఐ తెలిపింది. 2024-25లో సగటు కమిషన్‌ రేటు సుమారు 24 శాతంగా ఉంది.

ఈ నేపథ్యంలో బీమా విక్రయాల్లో ఖర్చులు తగ్గించడం, కస్టమర్లకు మరిన్ని ఎంపికలు ఇవ్వడం లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. డిజిటల్‌ మార్గాల్లో నేరుగా పాలసీలు కొనుగోలు చేసే అవకాశం కూడా పెరగొచ్చు.
Advertisement
IRDAI
Motor Insurance Rules
New Vehicle Insurance
Car and Bike Insurance
Insurance Commission Cuts
Bima Sugam

More Telugu News