చమురు ధరల భయంతో మార్కెట్‌ కుదేలు.. 23,100 దిగువకు నిఫ్టీ

చమురు ధరల భయంతో మార్కెట్‌ కుదేలు.. 23,100 దిగువకు నిఫ్టీ

Sensex and Nifty crash as oil price fears pull Nifty below 23100
  • సెన్సెక్స్‌ 1,247 పాయింట్లు పతనం
  • 383 పాయింట్లు నష్టపోయిన 23,100 దిగువకు చేరిన నిఫ్టీ
  • బ్యాంకింగ్‌ షేర్లలో భారీ అమ్మకాలు
  • చమురు ధరలు, బాండ్‌ మార్కెట్ల ప్రభావం
  • నిఫ్టీలో మూడు షేర్లు మాత్రమే లాభాల్లో
దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. పెరుగుతున్న ముడిచమురు ధరలు, ప్రపంచ బాండ్‌ మార్కెట్లలో అమ్మకాల ప్రభావంతో ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకునేందుకు వెనుకంజ వేశారు. దీంతో బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. సెన్సెక్స్‌ 1,247.71 పాయింట్లు నష్టపోయి 73,580.54 వద్ద ముగిసింది. నిఫ్టీ 383.70 పాయింట్లు కోల్పోయి 23,063.10 వద్ద స్థిరపడింది.

మార్కెట్‌ పతనం ప్రధాన షేర్లకే పరిమితం కాలేదు. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ 2.25 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 1.53 శాతం నష్టపోయాయి. నిఫ్టీలో మూడు షేర్లు మినహా మిగిలినవన్నీ నష్టాల్లోనే ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా పడిపోయి సూచీలపై ఒత్తిడి పెంచాయి.

బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లపై అమ్మకాల ప్రభావం ఎక్కువగా కనిపించింది. నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి. పెరుగుతున్న బాండ్‌ ఈల్డ్స్‌, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి ఈ రంగంపై ఇన్వెస్టర్ల ఆందోళనను పెంచాయి. మీడియా, ఫార్మా సూచీలు కూడా నష్టాల్లో ముగిసినా.. మిగతా రంగాలతో పోలిస్తే నష్టం తక్కువగా ఉంది.

నిఫ్టీ 23,000 స్థాయిని నిలబెట్టుకోలేకపోతే 22,900-22,800 జోన్‌ వరకు పడిపోయే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 23,200 స్థాయి తక్షణ నిరోధంగా ఉంటుందని పేర్కొన్నారు. ముడిచమురు ధరలు, ప్రపంచ బాండ్‌ మార్కెట్‌ పరిణామాలపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారని నిపుణులు వివరించారు.
Advertisement
Sensex
Nifty 50
Stock Market Crash
Crude Oil Prices
Indian Share Market
Global Bond Yields

More Telugu News