ఆన్‌లైన్ షాపింగ్: జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. కొనేముందు ఈ 7 జాగ్రత్తలు తప్పనిసరి!

ఆన్‌లైన్ షాపింగ్: జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. కొనేముందు ఈ 7 జాగ్రత్తలు తప్పనిసరి!

Online Shopping New Rules From January 1 Follow These 7 Safety Tips
  • వ‌చ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఈ-కామర్స్ సవరణ రూల్స్‌
  • ఆన్‌లైన్ షాపింగ్‌లో పారదర్శకత పెంచి, వినియోగదారులను కాపాడటమే లక్ష్యం
  • అమ్మకందారుడి వివరాలు, పేమెంట్ పేజీని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచన
  • సెర్చ్ ఫలితాలు, స్పాన్సర్డ్ లిస్టింగ్‌లను గుడ్డిగా నమ్మవద్దని నిపుణుల హెచ్చరిక
  • కొత్త నిబంధనలు వచ్చినా కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం
ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారి హక్కులను పరిరక్షించేందుకు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 'వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) (సవరణ) నిబంధనలు-2026' పేరుతో కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఈ నిబంధనలు 2027, జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 

ధరల నిర్ణయం, అమ్మకందారుల వివరాల వెల్లడి, సెర్చ్ ర్యాంకింగ్స్, స్పాన్సర్డ్ జాబితాలు, డార్క్ ప్యాటర్న్స్, ఫిర్యాదుల పరిష్కారం వంటి కీలక అంశాలపై ఈ నిబంధనలు దృష్టి సారించాయి.

ఈ నిబంధనలు వినియోగదారులకు అదనపు భద్రతను కల్పిస్తున్నప్పటికీ, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొనుగోలు పూర్తి చేసే ముందు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన ఏడు ముఖ్యమైన జాగ్రత్తలను వారు వివరిస్తున్నారు.

1. అమ్మకందారుడి వివరాలు సరిచూసుకోండి: కేవలం వస్తువు ఫోటోలు, ఆకర్షణీయమైన రివ్యూలు చూసి మోసపోవద్దు. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి అమ్మకందారుడు తన వ్యాపార వివరాలు, చిరునామా, కస్టమర్ సర్వీస్ సమాచారం, రేటింగ్స్‌ను ప్లాట్‌ఫామ్‌పై తప్పక ప్రదర్శించాలి. ముఖ్యంగా ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు ఈ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం.

2. పేమెంట్ పేజీని తనిఖీ చేయండి: డబ్బులు చెల్లించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉన్న వెబ్‌సైట్ అడ్రస్‌ను (యూఆర్ఎల్‌) ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి. అది మీరు షాపింగ్ చేస్తున్న ప్లాట్‌ఫామ్ లేదా గుర్తింపు పొందిన పేమెంట్ గేట్‌వేదేనా? కాదా? అని నిర్ధారించుకోవాలి. అనుమానాస్పదంగా వేరే పేజీకి వెళ్తే వెంటనే వెనక్కి వచ్చేయాలి. మీ ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోవద్దు.

3. సెర్చ్ ఫలితాలను గుడ్డిగా నమ్మొద్దు: కొత్త నిబంధనల ప్రకారం, ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా సెర్చ్ ఫలితాలను మార్చకూడదు. అయినప్పటికీ, సెర్చ్‌లో పై వరుసలో కనిపించిన ప్రతి ఉత్పత్తి నాణ్యమైనదని గుడ్డిగా నమ్మకూడదు. స్వతంత్రంగా అమ్మకందారుడి వివరాలు, ఇతర వినియోగదారుల రివ్యూలను పరిశీలించడం ఉత్తమం.

4. స్పాన్సర్డ్ లిస్టింగ్‌లను గుర్తించండి: కొన్ని ఉత్పత్తులు డబ్బులు చెల్లించడం ద్వారా సెర్చ్ ఫలితాల్లో పైన కనిపిస్తాయి. వీటిని తప్పనిసరిగా 'స్పాన్సర్డ్' లేదా 'ప్రకటన' అని స్పష్టంగా సూచించాలి. పై స్థానంలో ఉందని మాత్రమే ఆ ఉత్పత్తి నమ్మకమైనదని భావించవద్దు. అది కేవలం ఒక ప్రకటన అని గుర్తుంచుకోవాలి.

5. డార్క్ ప్యాటర్న్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి: మిమ్మల్ని తికమకపెట్టి, అనవసరమైన కొనుగోళ్లకు లేదా సేవలకు సబ్‌స్క్రైబ్ చేయించే మోసపూరిత డిజైన్లను 'డార్క్ ప్యాటర్న్స్' అంటారు. కొత్త రూల్స్ ప్రకారం వీటిని నిషేధించారు. అనుకోని పాప్-అప్‌లు, సున్నితమైన సమాచారం అడిగే అభ్యర్థనల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

6. అనవసర డేటా ఇవ్వొద్దు: కొనుగోలుకు ఎంత వ్యక్తిగత సమాచారం అవసరమో అంతే ఇవ్వండి. ప్లాట్‌ఫామ్‌లు ఏ సమాచారం ఎందుకు అడుగుతున్నాయో గమనించండి. అవసరం లేని వివరాలను పంచుకోవద్దు. మీ షాపింగ్ ఖాతాలకు బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం ద్వారా మీ డేటాను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

7. లావాదేవీల రికార్డులను భద్రపరచండి: కొనుగోలుకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లు, ఆర్డర్ కన్ఫర్మేషన్ ఈ-మెయిల్స్, పేమెంట్ రసీదులు, అమ్మకందారులతో జరిపిన సంభాషణలను భద్రపరచుకోవాలి. భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే, ఫిర్యాదు చేయడానికి ఇవి కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయి. కొత్త రూల్స్ ప్రకారం.. ఫిర్యాదు అందిన 48 గంటల్లోగా గ్రీవెన్స్ ఆఫీసర్ స్పందించి, దాని రికార్డును అందించాలి.

ఈ కొత్త నిబంధనలు డిజిటల్ మార్కెట్‌ను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఉద్దేశించినవే. అయినప్పటికీ, పేమెంట్లు, డేటా భద్రత, వివాదాల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉంటేనే నష్టపోయే ప్రమాదాన్ని తగ్గించుకోగలరు.
Advertisement
Online Shopping
Consumer Protection Rules 2026
E-commerce Guidelines India
Safe Shopping Tips
Dark Patterns Prohibition
Digital Buyer Rights

More Telugu News