మద్యం మత్తులో నిర్వాకం.. చెరువులో నిద్రపోయి, వరదలో చిక్కుకున్న యువకులు!

మద్యం మత్తులో నిర్వాకం.. చెరువులో నిద్రపోయి, వరదలో చిక్కుకున్న యువకులు!

Dharmapuri Youths stuck in flooded pond after sleeping in jeep while drunk
  • తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఘటన
  • చెరువులో నీళ్లు లేవని జీపును లోపలికి తీసుకెళ్లి నిద్ర
  • భారీ వర్షానికి చెరువు నిండిపోవడంతో జీపు నీట మునక
  • పొక్లెయిన్ సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన స్థానికులు
తమిళనాడులో ఇద్దరు యువకులు మద్యం మత్తులో చేసిన నిర్వాకం వారిని ప్రమాదంలో పడేసింది. ధర్మపురి జిల్లాలో చెరువులో ఆపిన జీపులోనే నిద్రపోగా, రాత్రికి రాత్రే కురిసిన భారీ వర్షానికి నీటిలో చిక్కుకుపోయారు. స్థానికులు సకాలంలో స్పందించి వారిని కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది.

ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని కుమారచెట్టి గ్రామంలో ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు జీపులో గ్రామ చెరువు వద్దకు వచ్చారు. ఆ సమయంలో చెరువులో నీరు తక్కువగా ఉండటంతో, జీపును నేరుగా లోపలికి నడుపుకెళ్లారు. అక్కడే మద్యం తాగి, మత్తులో వాహనంలోనే నిద్రలోకి జారుకున్నారు.

అయితే, తెల్లవారుజామున ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులోకి ఒక్కసారిగా నీరు చేరి నీటిమట్టం వేగంగా పెరిగింది. జీపు నడుము లోతు నీటిలో మునిగిపోవడంతో ఉలిక్కిపడి లేచిన యువకులు, ప్రమాదాన్ని గ్రహించి సాయం కోసం కేకలు వేశారు. వారి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ పొక్లెయిన్ సహాయంతో జీపుకు తాడు కట్టి, జాగ్రత్తగా బయటకు లాగారు.

ఈ ఘటనలో యువకులకు ఎలాంటి గాయాలు కాలేదు. వారు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సహాయక చర్యలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువకుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు.  
Advertisement
Dharmapuri Youths
Tamil Nadu Rain
Flooded Pond Rescue
Drunk Driving Jeep
Poclain Rescue Operation
Kumarachetti Village Incident

More Telugu News