గుడిలో గంట ఎందుకు కొడతారు? అసలు కారణం ఇదేనట!

గుడిలో గంట ఎందుకు కొడతారు? అసలు కారణం ఇదేనట!

Temple Bell Significance Why do we ring the bell in the temple
  • గుడిలో గంట కొట్టడం వెనుక ప్రత్యేకమైన భావన
  • మన దృష్టిని ప్రార్థన వైపు మళ్లించే గంట శబ్దం
  • గంటలను పంచలోహాలతో తయారు చేసే సంప్రదాయం
  • మనసును ప్రశాంతంగా చేసే గంట శబ్దం
  • శబ్దం తర్వాత వచ్చే నిశ్శబ్దాన్ని గమనించడం ముఖ్యం
గుడిలోకి అడుగు పెట్టగానే చాలామంది చేసే మొదటి పని గంట కొట్టడం. చిన్నప్పటి నుంచి చూస్తున్న అలవాటే కావడంతో.. అసలు ఎందుకు గంట కొడతామనే ప్రశ్న చాలామందికి రాదు. పెద్దలను అడిగితే ‘దేవుడిని నిద్రలేపడానికి’ అని సింపుల్‌గా చెప్పేస్తారు. కానీ ఆలయ గంట వెనుక అంతకంటే లోతైన భావన ఉందని చెబుతారు. ఆ గంట శబ్దం మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి మన దృష్టిని ఆలయం వైపు మళ్లించడమే కాకుండా.. ప్రార్థనకు మనసును సిద్ధం చేసే ఒక మార్గంగా కూడా భావిస్తారు.

గంట మోగగానే.. మనసు అక్కడే ఆగాలి
గుడిలోకి వెళ్లే ముందు మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతుంటాయి. ఉద్యోగం, కుటుంబం, ఫోన్‌ మెసేజ్‌లు, సమస్యలు.. ఇలా మనసంతా రకరకాల విషయాలతో నిండిపోయి ఉంటుంది. గుడి గుమ్మం దగ్గర గంట మోగించగానే ఆ శబ్దం ఒక్కసారిగా మన దృష్టిని ఆకర్షిస్తుంది. కాసేపు బయట ప్రపంచాన్ని పక్కన పెట్టి.. మనం చేస్తున్న పనిపై దృష్టి పెట్టేలా చేస్తుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన ‘కల్చర్‌ కీ పాఠశాల’ సిరీస్‌లోనూ ఇదే విషయాన్ని వివరించారు. గంట శబ్దం మనసును అప్రమత్తం చేసి.. పవిత్ర ప్రదేశంలోకి అడుగుపెడుతున్నామనే భావనను కలిగిస్తుందని పేర్కొన్నారు.

ఐదు లోహాల కలయికతో తయారీ
ఆలయ గంటల తయారీలో సంప్రదాయంగా పంచలోహాలను ఉపయోగిస్తారని చెబుతారు. అంటే ఐదు లోహాల కలయికతో గంటలను తయారు చేసే పద్ధతి ఉంది. భారతదేశంలో లోహాల తయారీ, శిల్పకళకు ఉన్న ప్రాచీన సంప్రదాయాన్ని ఇది ప్రతిబింబిస్తుందని ‘కల్చర్‌ కీ పాఠశాల’ వీడియోలో వివరించారు. ఈ లోహాల కలయిక వల్ల గంట మోగినప్పుడు ప్రత్యేకమైన ప్రతిధ్వని వచ్చేలా రూపొందిస్తారని చెబుతారు.

శబ్దం కంటే.. ఆ తర్వాతి నిశ్శబ్దమే ముఖ్యం
గంట కొట్టడం అంటే గట్టిగా శబ్దం చేయడం మాత్రమే కాదు. గంట శబ్దాన్ని కాసేపు శ్రద్ధగా వినడం ద్వారా మనసును ప్రశాంతంగా మార్చుకోవచ్చనే భావన ఉంది. గంట మోగినప్పుడు వచ్చే లోతైన, ప్రతిధ్వనించే శబ్దం కొద్దిసేపు మన దృష్టిని పూర్తిగా తనవైపు తిప్పుతుంది. దీంతో మనసులోని ఇతర ఆలోచనలు కాస్త పక్కకు వెళ్తాయి. ఆ శబ్దం క్రమంగా తగ్గిపోయే సమయంలో వచ్చే నిశ్శబ్దాన్ని గమనించడమే అసలు ఉద్దేశంగా భావిస్తారు.

‘దేవుడిని నిద్రలేపడం’ అనేది సింపుల్‌ వివరణేనా?
చిన్నప్పుడు గంట ఎందుకు కొడతామని అడిగితే.. ‘దేవుడిని నిద్రలేపడానికి’ అని పెద్దలు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇది పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పిన సమాధానం కావచ్చని ఈ వివరణ చెబుతోంది. అసలు ఉద్దేశం దేవుడిని నిద్రలేపడం కంటే.. మనసును మేల్కొలపడం. బయట ప్రపంచంలోని ఆలోచనలను కాసేపు పక్కన పెట్టి.. ప్రార్థనపై దృష్టి పెట్టేలా మనల్ని మనం సిద్ధం చేసుకోవడమే గంట మోగించడం వెనుక ఉన్న భావనగా చెబుతారు.
Advertisement
Temple Bell
Spiritual Significance
Panchaloha Composition
Hindu Temple Traditions
Mindfulness and Prayer
Indian Culture

More Telugu News