రెచ్చిపోవద్దు.. లోపల దాచుకోవద్దు.. కోపాన్ని హ్యాండిల్‌ చేయడానికి 5 చిట్కాలు!

రెచ్చిపోవద్దు.. లోపల దాచుకోవద్దు.. కోపాన్ని హ్యాండిల్‌ చేయడానికి 5 చిట్కాలు!

Anger Management 5 tips to handle anger without suppressing or exploding
  • కోపం వెనుక అసలు కారణాన్ని గుర్తించాలంటున్న నిపుణులు
  • కోపం వచ్చిందని మిమ్మల్ని మీరు నిందించుకోవద్దని సూచన
  • కోపంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దని హితవు
  • ఏ విషయం బాధించిందో స్పష్టంగా చెప్పాలని హితవు
  • అవసరమైతే మీ హద్దులను స్పష్టంగా నిర్ణయించండని సూచన
ఒక్క క్షణంలో మన మాటలను, మన నిర్ణయాలను మార్చేయగల భావోద్వేగం కోపం. ఎవరైనా మన హద్దులు దాటితే, మనల్ని బాధపెడితే కోపం రావడం సహజం. కానీ దాన్ని వెంటనే బయటకు వెళ్లగక్కడం ఒక సమస్య అయితే.. ఏమీ జరగనట్టు లోపలే దాచుకోవడం మరో సమస్య. కొద్దిసేపటికి కోపం తగ్గిపోయినా.. జరిగిన సంఘటన మాత్రం గంటల తరబడి మనసులో తిరుగుతూనే ఉంటుంది. మరి కోపాన్ని అణచుకోకుండా, అదుపు తప్పకుండా ఎలా ఎదుర్కోవాలో చూద్దాం..!

అసలు కోపం ఎందుకొచ్చింది?
కోపానికి కనిపించే కారణమే అసలు విషయం కాకపోవచ్చు. స్నేహితుడు చివరి నిమిషంలో ప్లాన్‌ రద్దు చేశాడనుకోండి. దానిపై కోపం రావచ్చు. కానీ దాని వెనుక ‘నన్ను పట్టించుకోవడం లేదు’ అన్న బాధ ఉండొచ్చు. చిన్న గొడవ కూడా రోజులుగా పేరుకుపోయిన అసంతృప్తిని బయటకు తీసుకురావచ్చు. అందుకే స్పందించే ముందు.. అసలు ఏ విషయం బాధించిందో ఆలోచించండి.

మిమ్మల్ని మీరు తప్పుపట్టుకోవద్దు
‘నాకు కోపం ఎందుకు వచ్చింది?’ అని మిమ్మల్ని మీరు నిందించుకోవాల్సిన అవసరం లేదు. కోపం రావడం మిమ్మల్ని చెడ్డ వ్యక్తిగా మార్చదు. ఆ భావనను నిజాయతీగా గుర్తించడం ముఖ్యం. ‘నాకు ఈ విషయం మీద కోపంగా ఉంది’ అని అంగీకరించడం.. సమస్యను అర్థం చేసుకునే మొదటి అడుగు.

ఆ క్షణంలో పెద్ద నిర్ణయాలు వద్దు
కోపంలో పంపిన మెసేజ్‌ తర్వాత బాధపడే పరిస్థితి రావచ్చు. అదే సమయంలో సంబంధాన్ని తెంచుకోవడం, కఠినమైన మాటలు చెప్పడం వంటి నిర్ణయాలు మరింత సమస్యకు దారితీయొచ్చు. అందుకే కాసేపు ఆగండి. మెసేజ్‌ రాయాలనిపిస్తే రాయండి.. కానీ వెంటనే పంపకండి. కాసేపు నడవండి. ఒంటరిగా ఉండండి. మనసు కుదుటపడిన తర్వాతే మాట్లాడండి.

ఏది హద్దు దాటిందో స్పష్టంగా చెప్పండి
‘నువ్వు ఎప్పుడూ నన్ను గౌరవించవు’ అని చెప్పడం కంటే.. అసలు ఏం బాధించిందో చెప్పడం మంచిది. వ్యక్తిగత విషయాన్ని ఇతరులతో పంచుకున్నారా? పదేపదే ఇచ్చిన మాట తప్పారా? మీకు ముఖ్యమైన విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారా? అసలు సమస్య ఏదో స్పష్టంగా చెబితే అవతలి వ్యక్తికి కూడా అర్థమవుతుంది. అవసరమైతే మీ హద్దులను కూడా స్పష్టంగా చెప్పొచ్చు.

ప్రతీది మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు
ప్రతి సమస్యకు క్షమాపణ రావాల్సిందేనని ఎదురు చూస్తే మనసు అదే సంఘటన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అవతలి వ్యక్తి తన తప్పును ఎప్పటికీ అంగీకరించకపోవచ్చు. దాన్ని అంగీకరించడం అంటే వారి ప్రవర్తనను సమర్థించడం కాదు. ఆ సంఘటన ఇకపై మీ సమయాన్ని, ప్రశాంతతను దోచుకోనివ్వకపోవడమే. కొన్ని సందర్భాల్లో చివరి మాట మనదిగా ఉండటం కంటే.. ఆ మాట చెప్పాల్సిన అవసరం లేకపోవడమే నిజమైన ప్రశాంతత.
Advertisement
Anger Management
Mental Health Tips
Emotional Intelligence
Controlling Anger
Stress Relief
Psychology

More Telugu News