మరో లోన్‌ తీసుకుంటున్నారా? ముందుగా ఈ లెక్క చూడండి!

మరో లోన్‌ తీసుకుంటున్నారా? ముందుగా ఈ లెక్క చూడండి!

Taking another loan Check this calculation first
  • ఈఎంఐ-ఆదాయ నిష్పత్తిని ముందుగా పరిశీలించాలంటున్న నిపుణులు
  • చేతికి వచ్చే నెలవారీ ఆదాయాన్నే లెక్కలోకి తీసుకోవాలని సూచన
  • 30 శాతంలోపు ఈఎంఐలు ఉండటం ఆరోగ్యకరమైన లక్ష్యంగా సిబిల్‌ సూచన
  • కొత్త ఈఎంఐతో మొత్తం రుణభారం మళ్లీ లెక్కించాలని సూచన
  • మొత్తం ఈఎంఐలు 50 శాతానికి చేరితే బ్యాంకులు నిశితంగా పరిశీలిస్తాయని వెల్లడి
జీతం వస్తోంది.. ఖర్చులు సాఫీగానే సాగుతున్నాయి. దీంతో మరో లోన్‌ తీసుకోవడం పెద్ద భారంగా అనిపించకపోవచ్చు. కానీ ఇప్పటికే ఉన్న ఈఎంఐలకు కొత్త ఈఎంఐ జత అయితే నెలవారీ బడ్జెట్‌పై ఒత్తిడి పెరగొచ్చు. అందుకే కొత్త లోన్‌కు ఓకే చెప్పే ముందు ఆదాయంలో ఎంత శాతం అప్పుల చెల్లింపులకే వెళ్తుందో తెలుసుకోవడం ముఖ్యం.

ఆదాయం ఎంత? ఈఎంఐలు ఎంత?
కొత్త లోన్‌ విషయంలో ముందుగా చేతికి వచ్చే నెలవారీ ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోవాలి. స్థూల జీతాన్ని కాకుండా పన్నులు, ఇతర మినహాయింపుల తర్వాత బ్యాంకు ఖాతాలో జమయ్యే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

తర్వాత ప్రస్తుతం చెల్లిస్తున్న అన్ని ఈఎంఐలను కలపాలి. గృహ రుణం, కారు లోన్‌, పర్సనల్‌ లోన్‌, విద్యా రుణం వంటి చెల్లింపులతో పాటు క్రెడిట్‌ కార్డు బకాయిలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

30 శాతం.. ఓ హెచ్చరిక రేఖ
ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ సూచనల ప్రకారం.. నెలవారీ ఆదాయంలో ఈఎంఐలు, క్రెడిట్‌ బకాయిల వాటా 30 శాతంలోపు ఉండటం ఆరోగ్యకరమైన స్థాయిగా పరిగణించవచ్చు. అయితే ఇది అందరికీ వర్తించే కచ్చితమైన పరిమితి కాదు.

ఉదాహరణకు నెలకు రూ.80 వేల ఆదాయం ఉందనుకుందాం. ప్రస్తుతం రూ.20 వేల ఈఎంఐలు ఉంటే అప్పుల చెల్లింపుల వాటా 25 శాతం. మరో రూ.8 వేల ఈఎంఐ వచ్చే లోన్‌ తీసుకుంటే మొత్తం చెల్లింపులు రూ.28 వేలకు చేరతాయి. అప్పుడు ఈఎంఐ-ఆదాయ నిష్పత్తి 35 శాతానికి పెరుగుతుంది.

50 శాతం దాటితే జాగ్రత్త
ఈఎంఐలు ఆదాయంలో 50 శాతానికి చేరడం లేదా దాటడాన్ని రుణదాతలు సాధారణంగా నిశితంగా పరిశీలిస్తారు. అయితే కొత్త లోన్‌ తీసుకునే ముందు ఈఎంఐలతో పాటు అద్దె, ఇంటి ఖర్చులు, బీమా ప్రీమియాలు, ఇతర నెలవారీ బిల్లులను కూడా లెక్కలోకి తీసుకోవాలి.

కొత్త ఈఎంఐను భరించగలమా? అనే విషయాన్ని కేవలం ఆ ఒక్క చెల్లింపు ఆధారంగా నిర్ణయించకూడదు. మొత్తం నెలవారీ ఆర్థిక బాధ్యతలను చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం కీలకం.
Advertisement
Personal Loan
EMI Calculation
Debt to Income Ratio
Financial Planning
CIBIL Score Tips
Loan Eligibility

More Telugu News