గుండె ఆరోగ్యానికి రోజూ 10 వేల అడుగులు నడవాల్సిందేనా? వైద్యులు చెప్పిందేంటి?

Heart health is walking 10000 steps daily necessary what doctors say
  • 10 వేల అడుగులు తప్పనిసరి కాదంటున్న డాక్టర్లు
  • 60 ఏళ్లు దాటిన వారికి 6-8 వేల అడుగులే సరిపోతాయని సూచన
  • క్రమం తప్పకుండా నడవడమే కీలకమని వెల్లడి
  • వేగంగా నడిస్తే గుండెకు మరింత మేలని వివరణ
  • రక్తపోటు, కొలెస్ట్రాల్‌, గుండెపోటు ముప్పు తగ్గుతుందని వెల్లడి
  • వారానికి 150 నిమిషాల వ్యాయామం చేయాలని సూచన
చాలామంది రోజుకు 10 వేల అడుగులు నడిస్తేనే గుండె ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తుంటారు. అయితే అది తప్పనిసరి కాదని గుండె నిపుణులు చెబుతున్నారు. రోజూ క్రమం తప్పకుండా నడవడమే ముఖ్యమని, ఆరు వేల అడుగులు నడిచినా గుండెకు మంచి ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు.

గుండె జబ్బుల నిపుణుడు డాక్టర్ సమీర్ గుప్తా ప్రకారం.. రోజూ 10 వేల అడుగులు నడవాలన్న నిబంధనేమీ లేదు. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి రోజుకు ఆరు వేల నుంచి ఎనిమిది వేల అడుగులు నడిస్తే గుండె జబ్బులు, పక్షవాతం ముప్పు గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు.

10 వేల అడుగుల లక్ష్యం వైద్య పరిశోధనల నుంచి రాలేదని సమీర్ గుప్తా స్పష్టం చేశారు. 1960ల్లో జపాన్‌లో ఓ పెడోమీటర్ ప్రచారంతో అది ప్రాచుర్యం పొందిందని వివరించారు. అయితే అంతకంటే తక్కువ నడిస్తే ఉపయోగం ఉండదనుకోవడం సరైన అభిప్రాయం కాదన్నారు.

‘‘రోజూ నడక వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గడంతో పాటు గుండెపోటు, పక్షవాతం ప్రమాదం కూడా తగ్గుతుంది’’ అని సమీర్ గుప్తా తెలిపారు.

అయితే యువత, మధ్య వయసు వారు రోజుకు 8 వేల నుంచి 10 వేల అడుగులు వేగంగా నడిస్తే అదనపు ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. బరువు నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయులు, ఇన్సులిన్ పనితీరు మెరుగుపడతాయని వివరించారు. 10 నుంచి 12 వేల అడుగులు దాటిన తర్వాత అదనపు ప్రయోజనం పెద్దగా ఉండదని పేర్కొన్నారు.

రోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాలు వేగంగా నడవడం, వారం మొత్తంలో 150 నిమిషాల మోస్తరు వ్యాయామం చేయడం మంచిదని సూచించారు. మెట్లు ఎక్కడం, ఫోన్ మాట్లాడేటప్పుడు నడవడం, భోజనం తర్వాత 10 నిమిషాలు నడవడం వంటి అలవాట్లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పారు.

అయితే గుండె జబ్బులు, అదుపులో లేని రక్తపోటు, తీవ్రమైన కీళ్ల సమస్యలు ఉన్నవారు ఒక్కసారిగా నడక పెంచకుండా ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచించారు.
Advertisement
Heart health
Dr Sameer Gupta
Walking benefits
10000 steps myth
Cardiovascular fitness
Daily exercise tips

More Telugu News