అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పురుషుల టెస్ట్ ప్లేయర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ టెస్ట్ జట్టు కెప్టెన్ రహ్మత్ షా అరుదైన రికార్డు సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లోని ఏ విభాగంలోనైనా టాప్ 10లో చోటు దక్కించుకున్న తొలి  ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. బ్యాటర్ల విభాగంలో ఆరు స్థానాలు ఎగబాకిన 33 ఏళ్ల రహ్మత్ షా, కెరీర్ బెస్ట్ రేటింగ్‌తో ఏడో స్థానానికి చేరుకున్నాడు.

షార్జా వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో రహ్మత్ షా 173 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో అతడికి ఇది ఐదో శతకం కాగా, ఈ ఏడాదిలో రెండోది. ఈ నిలకడైన ప్రదర్శనతో షా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్‌క్రమ్, శ్రీలంక స్టార్ కమిందు మెండిస్ వంటి ప్రముఖ ఆటగాళ్లను వెనక్కి నెట్టి 7వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవలే జింబాబ్వే, బంగ్లాదేశ్‌లతో జరిగిన ట్రై-సిరీస్‌ను గెలుచుకుని, ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో చరిత్రలోనే అత్యుత్తమంగా ఆరో స్థానానికి చేరిన  ఆఫ్ఘనిస్థాన్‌కు రహ్మత్ షా ఘనత మరో మైలురాయిగా నిలిచింది.

ఇదే టెస్టులో జింబాబ్వే తరఫున రెండో ఇన్నింగ్స్‌లో అజేయ డబుల్ సెంచరీ సాధించిన సీనియర్ బ్యాటర్ క్రెయిగ్ ఇర్విన్ 9 స్థానాలు మెరుగుపరుచుకుని 48వ స్థానానికి చేరుకున్నాడు. 

మరోవైపు బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య ముగిసిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్ ఆధారంగా కూడా పలువురు ఆటగాళ్ల ర్యాంకులు మారాయి. వెస్టిండీస్ బ్యాటర్ కావెమ్ హాడ్జ్ 12 స్థానాలు ఎగబాకి 52వ ర్యాంకుకు చేరగా, బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహిద్ హృదయ్ 60వ స్థానానికి, విండీస్ ఆటగాడు అమీర్ జంగూ 28 స్థానాలు మెరుగై 62వ స్థానానికి చేరుకున్నారు.

బౌలర్ల విభాగంలో బంగ్లాదేశ్‌పై ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన వెస్టిండీస్ స్పిన్నర్ జోమెల్ వారికన్ 11 స్థానాలు ఎగబాకి సంయుక్తంగా 19వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో అతడు 31వ స్థానానికి చేరగా, అతడి సహచరుడు జస్టిన్ గ్రీవ్స్ ఒక స్థానం మెరుగై ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ ఫలితాలు కూడా తాజా ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపాయి. రెండో వన్డేలో 28 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ 23 స్థానాలు ఎగబాకి 21వ ర్యాంకుకు చేరుకున్నారు. తొలి వన్డేలో నాలుగు వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 11 స్థానాలు మెరుగై సంయుక్తంగా 31వ ర్యాంకును దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో అత్యధికంగా 7 వికెట్లు తీసిన యువ పేసర్ గుర్నూర్ బ్రార్ టాప్ 100 వెలుపల నుంచి ఏకంగా 48వ స్థానానికి దూసుకెళ్లడం విశేషం. కివీస్ పేసర్లు జాకబ్ డఫీ 43వ స్థానానికి, కైల్ జేమీసన్ 60వ స్థానానికి చేరుకున్నారు.