టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన వ్యక్తిగత జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రముఖ మోడల్, సినీ నటి సమ్రీన్ కౌర్‌ ముందు తన ప్రేమను వ్యక్తపరిచాడు. బుధవారం (నవంబర్ 11) న్యూజిలాండ్‌లో అర్షదీప్ తన ప్రియురాలికి ప్రపోజ్ చేయగా, ఆమె "యస్" అని చెప్పడంతో ఆమె వేలికి ఉంగరం తొడిగాడు.

దీనికి సంబంధించిన ఫొటోలను అర్ష్‌దీప్, సమ్రీన్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. సమ్రీన్ ఈ సందర్భంగా ఒక భావోద్వేగ సందేశాన్ని రాసుకొచ్చారు. "జీవితం మాకు ఇచ్చిన వాటన్నింటికంటే ఒకరినొకరం దక్కించుకోవడమే నాకు అత్యంత సంతోషాన్నిచ్చింది. జీవితాంతం కలిసి ఉండే ప్రయాణం మొదలైంది. 11.11.2026 (హాయ్ ఫియాన్సీ) అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం భారత వన్డే జట్టు పర్యటనలో భాగంగా అర్ష్‌దీప్ న్యూజిలాండ్‌లోనే ఉన్నాడు. అక్కడే తన ప్రియురాలి ప్రేమను గెలుచుకుని పెళ్లి దిశగా ముందడుగు వేశాడు.

వీరిద్దరి బంధం గురించి ఇప్పటికే క్రీడా వర్గాల్లో చర్చ సాగింది. ఈ ఏడాది జులై ఆఖర్లో అర్ష్‌దీప్ "మై పర్సన్" అనే క్యాప్షన్‌తో సమ్రీన్ ఫొటోలను పంచుకుని తమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు. అంతకుముందు ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన సందర్భంగా వీరిద్దరూ కలిసి చేసే డ్యాన్స్ స్టెప్‌తో అర్ష్‌దీప్ సంబరాలు చేసుకుని, ఆ ఘనతను ఆమెకే అంకితం ఇచ్చారు.

ఎవరీ సమ్రీన్ కౌర్?
జమ్మూకశ్మీర్‌కు చెందిన సమ్రీన్ కౌర్ మోడల్‌గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఆమె ఫైనలిస్ట్‌గా నిలిచారు. భారత క్రికెట్ జట్టు చారిత్రక విజయం ఆధారంగా తెరకెక్కిన ‘83’ సినిమాలో సమ్రీన్ నటించారు. అలాగే జీ5 వెబ్ సిరీస్ ‘నెయిల్ పాలిష్’, పంజాబీ చిత్రం ‘సర్దార్ జీ 2’లలోనూ ముఖ్య పాత్రలు పోషించారు. గురు రంధావా, బాద్‌షా, జుబిన్ నౌటియాల్ వంటి ప్రముఖ గాయకుల మ్యూజిక్ వీడియోలలో కూడా నటించి విశేష ఆదరణ దక్కించుకున్నారు.

ఒకే రోజు రెండు పెద్ద ముచ్చట్లు
అర్ష్‌దీప్ సింగ్‌కు ఈ రోజు కెరీర్ పరంగా కూడా ఎంతో కీలకంగా మారింది. ఒకవైపు నిశ్చితార్థం జరగ్గా, మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారీ మార్పు చోటుచేసుకుంది. 2027 ఐపీఎల్ సీజన్ కోసం అర్ష్‌దీప్ పంజాబ్ కింగ్స్ నుంచి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ట్రేడ్ అయ్యాడు. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా పంజాబ్‌కు వెళ్లగా, అర్ష్‌దీప్ ముంబై గూటికి చేరాడు. అతడి ప్రస్తుత ఫీజు రూ.18 కోట్లతోనే ఈ ట్రేడింగ్ ఒప్పందం పూర్తయింది. 2019లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్, ఇప్పటివరకు పంజాబ్ తరఫున 96 మ్యాచ్‌ల్లో 111 వికెట్లు తీసి ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అర్ష్‌దీప్ జీవితంలో ఒకే రోజు రెండు శుభ పరిణామాలు చోటుచేసుకోవడంతో అభిమానులు, సహచర క్రికెటర్లు అతడికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
20261111frae47d80b10a7.jpg20261111frdea69518e2cc.jpg20261111fred70e445bc22.jpg20261111frf7a6bde69230.jpg20261111fr40f4e678e2d4.jpg