సామాన్యుడికి గుడ్డు సెగ.. కోడిగుడ్డు ధరకు రెక్కలు

Egg prices skyrocket causing trouble for common man
  • ఏడు నుంచి ఎనిమిది రూపాయలకు చేరిన కోడిగుడ్డు ధర
  • రూ.205కి చేరిన 30 గుడ్లతో కూడిన ట్రే ధర
  • మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిన అధిక ఉష్ణోగ్రతలు

కూరగాయల ధరల మంటతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య ప్రజలకు కోడిగుడ్ల ధరలు కూడా షాకిస్తున్నాయి. హైదరాబాద్ లో గతంలో ఐదు నుండి ఆరు రూపాయలు పలికిన ఒక్కో గుడ్డు ధర... ప్రస్తుతం మార్కెట్లో ఏడు నుండి ఎనిమిది రూపాయల వరకు చేరుకుంది. ఇక హోల్‌సేల్ మార్కెట్‌లో 30 గుడ్లతో కూడిన ఒక ట్రే ధర ఏకంగా రూ.205కి చేరింది. మునుపెన్నడూ లేని విధంగా చికెన్, గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోవడంతో అటు కొనుగోలుదారులు, ఇటు వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం రాష్ట్రంలో నమోదవుతున్న విపరీతమైన ఎండలేనని పౌల్ట్రీ ఫారాల నిర్వాహకులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల కోళ్లు సరిగ్గా మేత తినకపోవడంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు హీట్ స్ట్రోక్ కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటం మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఫలితంగా డిమాండ్‌కు తగ్గ సప్లై లేక ధరలకు రెక్కలు వచ్చాయి.


ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్ల వినియోగం ఎక్కువగా ఉండటంతో నిర్వాహకులపై అదనపు భారం పడుతోంది. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీల్లో కేక్‌ల తయారీకి గుడ్లు తప్పనిసరి కావడంతో వ్యాపారాలు సాగించడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. గత 25 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి మాట్లాడుతూ... తన సుదీర్ఘ అనుభవంలో ఎప్పుడూ గుడ్డు ధర ఇంత గరిష్ఠ స్థాయికి చేరలేదని, రెండేళ్ల క్రితం కేవలం కొన్ని రోజులు మాత్రమే ఇలాంటి పరిస్థితి చూశామని తెలిపారు.

Egg prices
Hyderabad
Poultry industry
Summer heatwave
Telangana food prices
Chicken production

More Telugu News