హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున సాగుతున్న అంతర్రాష్ట్ర అండాల అక్రమ సేకరణ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి నుంచి అండాలను సేకరించి ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్లకు అమ్ముకుంటున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 43 మంది మహిళలకు విముక్తి కల్పించారు. ముఠాకు చెందిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.

బేగంపేట్, సరూర్‌నగర్ పోలీసులు, మల్కాజ్‌గిరి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. ప్రకాశ్ నగర్, బేగంపేట్, ఎర్రగడ్డ, సరూర్‌నగర్, గోపాలపురం ప్రాంతాల్లోని పలు చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి పేద మహిళలను ఏజెంట్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 

ఒక్కో అండం సేకరణకు రూ.20,000 నుంచి రూ.30,000 వరకు ఇస్తామని ఆశ చూపి వారిని హైదరాబాద్‌కు రప్పిస్తున్నారు. ఇక్కడ అద్దె ఇళ్లలో ఉంచి, ఫెర్టిలిటీ సెంటర్లకు అనుసంధానం చేస్తున్నారు. అండాల సేకరణ కోసం మహిళలకు బలవంతంగా హార్మోన్ల ఇంజెక్షన్లు, మందులు ఇస్తున్నట్లు బాధితులు పోలీసులకు తెలిపారు.

దాడుల సమయంలో పోలీసులు హార్మోన్ల ఇంజెక్షన్లు, సిరంజిలు, మాత్రలతో పాటు కీలకమైన పత్రాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రాకెట్ ప్రధాన నిర్వాహకుడిగా అమిత్ శర్మ (44), మహిళలను రిక్రూట్ చేసే సహ నిర్వాహకురాలిగా నిక్కత్ పర్వీన్ (31)తో పాటు ఏజెంట్లు, ఏఆర్‌టీ బ్యాంక్ మేనేజర్ సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అమిత్ శర్మ ప్రకాశ్ నగర్‌లో రూ.50,000 అద్దె చెల్లిస్తూ రెండేళ్లుగా ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు.

మహిళల పేరుతో నకిలీ ఆధార్ కార్డులు, అఫిడవిట్లు, అంగీకార పత్రాలు సృష్టించి ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రాకెట్ వెనుక ఉన్న ఐవీఎఫ్ సెంటర్లు, ఏఆర్‌టీ బ్యాంకుల పాత్రపై కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై బేగంపేట్, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లలో మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. 

భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌), అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ ) రెగ్యులేషన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది.