శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన కుండపోత వానతో నగర జీవనం అస్తవ్యస్తంగా మారింది. గంటకు పైగా ఏకధాటిగా వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

నగరంలోని ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం రద్దీ సమయం కావడంతో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపయ్యాయి.

ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో పరిస్థితి తీవ్రంగా మారింది. మాదాపూర్, హైటెక్‌సిటీ, కేపీహెచ్‌బీ, మైండ్‌స్పేస్, ఐకియా మార్గాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. మాదాపూర్ సిటీ వైన్స్ వద్ద ప్రధాన రహదారి చెరువును తలపించడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కుత్బుల్లాపూర్ నుంచి సూరారం వరకు, షాపూర్ నుంచి గాజులరామారం వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షానికి తడుస్తూ కొందరు ప్రయాణికులు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకోగా, మరికొందరు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయారు.

ఉప్పల్, ఎల్బీనగర్, మణికొండ, రాయదుర్గం, రాజేంద్రనగర్ వంటి నగర శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అయితే, గత కొన్ని రోజులుగా నగరంలో తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.