తెలంగాణలో సన్న బియ్యం ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. మిల్లర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి, అక్రమ నిల్వల ద్వారా ధరలను పెంచుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. వినియోగదారులపై అదనపు భారం పడకుండా వివిధ రకాల సన్న బియ్యంపై గరిష్ఠ చిల్లర ధరలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

శనివారం మిల్లర్లు, వ్యాపారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ధరలను ఖరారు చేశారు. తాజా నిర్ణయం ప్రకారం.. బీపీటీ, కేఎన్ఎం రకం బియ్యం కిలోకు గరిష్ఠంగా రూ.66, తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ రకం రూ.74, అలాగే హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రకాలను రూ.79 మించి విక్రయించకూడదు. ప్రభుత్వం నిర్ణయించిన ఈ ధరల పట్టికను ప్రతి దుకాణంలోనూ వినియోగదారులకు కనిపించేలా తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల మార్కెట్‌లో నాణ్యమైన సన్నబియ్యం కిలో రూ.75 నుంచి రూ.95 వరకు విక్రయిస్తున్న నేపథ్యంలో, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో తూకంలో తేడాలు, ఎంఆర్‌పీ స్టిక్కర్ల ట్యాంపరింగ్ వంటి ఉల్లంఘనలపై ఆరు కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 420తో పాటు నిత్యావసర వస్తువుల చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.