లిక్కర్ స్కామ్‌తో నా భార్యకు సంబంధం లేదు: ఈడీ నోటీసులపై ఎంపీ కేశినేని చిన్ని క్లారిటీ!

Kesineni Chinni Clarifies Wifes Role in Liquor Scam ED Notice
  • లిక్కర్ స్కామ్‌ కేసులో కేశినేని జానకి లక్ష్మికి ఈడీ సమన్లు
  • తన భార్యకు వ్యక్తిగతంగా సమన్లు రాలేదన్న కేశినేని చిన్ని
  • ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు నోటీసులు వచ్చాయని వెల్లడి
  • గతంలో రాజ్ కేశిరెడ్డితో కలిసి ప్రైడ్ ఇన్‌ఫ్రా సంస్థను ఏర్పాటు చేశామన్న చిన్ని
  • 2022లో ఆ సంస్థ నుంచి తన భార్య బయటకు వచ్చిందని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో తన భార్య కేశినేని జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసిందంటూ వస్తున్న వార్తలపై విజయవాడ టీడీపీ లోక్‌సభ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్రంగా స్పందించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తన భార్యకు వ్యక్తిగతంగా ఎలాంటి సమన్లు రాలేదని, కేవలం ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు వచ్చిన నోటీసును కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.


'ఇశాన్వీ', 'కేశినేని డెవలపర్స్' సంస్థలు కలిసి ఉమ్మడిగా చేసిన ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఈడీ నుంచి నోటీసు వచ్చిందని చిన్ని తెలిపారు. ఆ సంస్థలో తన భార్య ఒక డైరెక్టర్‌గా మాత్రమే ఉన్నారని, అందుకే ఆ కంపెనీకి వచ్చిన నోటీసుపై ఈనెల 27వ తేదీన ఈడీ అధికారులకు పూర్తి వివరణ ఇస్తామని పేర్కొన్నారు.


పక్కపక్కనే ల్యాండ్ సైట్లు ఉండటంతో, లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డికి చెందిన 'ఇశాన్వీ' సంస్థతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం 2021లో 'ప్రైడ్ ఇన్‌ఫ్రా' సంస్థను ఏర్పాటు చేశామని చిన్ని తెలిపారు. ఆర్కిటెక్ట్ ఫీజు నిమిత్తం ఆ సంస్థ ద్వారా కేవలం రూ.35 లక్షల లావాదేవీలు మాత్రమే జరిగాయని ఎంపీ వెల్లడించారు.

రాజ్ కేసిరెడ్డి వ్యవహారాలు, ఆయన నేపథ్యం తెలిసిన వెంటనే... తాము అప్రమత్తమై 2022లోనే ఆ కంపెనీ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్లు చిన్ని స్పష్టం చేశారు. ఆనాటి రూ.35 లక్షల ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన వివరాలు కోరుతూనే ఈడీ నోటీసు పంపిందని, దానికి సంబంధించిన పక్కా ఆధారాలను అధికారులకు సమర్పిస్తామని చెప్పారు. లిక్కర్ స్కామ్‌తో తన భార్యకు గానీ, తమ కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని, కేవలం రూ. 35 లక్షల రియల్ ఎస్టేట్ ఆర్కిటెక్ట్ ఫీజు లావాదేవీని పట్టుకుని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Go Back to Shorts
Kesineni Chinni
Kesineni Janaki Lakshmi
Andhra Pradesh Liquor Scam
ED Notice
Ishanvi
Kesineni Developers
Pride Infra
Raj Kesireddy
Real Estate Project
Vijayawada TDP

More Telugu News