Jeevan Reddy: 40 ఏళ్ల అనుబంధానికి స్వస్తి.. రేవంత్ పై ధ్వజమెత్తుతూ కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా

Jeevan Reddy Quits Congress After 40 Years Criticizing Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగిత్యాలలో కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా లేఖను విడుదల చేసిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.


గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని, గౌరవం లేని చోట ఉండలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను పార్టీలోకి తీసుకోవడం, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


పదేళ్ల పాటు కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిన అసలైన కార్యకర్తలను పక్కన పెట్టి, ఇన్నాళ్లూ తమను ఇబ్బంది పెట్టిన వారికే పెద్దపీట వేస్తున్నారని ధ్వజమెత్తారు. తన వెన్నంటి ఉన్న కీలక నాయకుడు చనిపోతే సీఎం కనీసం పరామర్శించలేదని, రేవంత్ రెడ్డి తనకు అండగా నిలబడలేదని ఆరోపించారు. ఇకపై రేవంత్ రెడ్డి విధానాలపైనే తన పోరాటం ఉంటుందని ప్రకటించారు.

మరోవైపు, జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ చివరి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జీవన్ రెడ్డి తన నిర్ణయానికే కట్టుబడ్డారు. జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డికి ఉన్న బలమైన కేడర్ ఇప్పుడు ఆయన వెంటే నడిచే అవకాశం ఉంది.
Go Back to Shorts
Jeevan Reddy
Congress Party
Telangana Congress
Revanth Reddy
Jagityala
Sanjay Kumar
Ponnam Prabhakar
Sridhar Babu

More Telugu News