మనం గడిపిన క్షణాలను, చూసిన దృశ్యాలను మన మెదడు ఒక వీడియో కెమెరాలా రికార్డ్ చేస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, అది నిజం కాదు. వాస్తవానికి మెదడు జ్ఞాపకాలను భద్రపరిచే విధానం చాలా భిన్నంగా, సంక్లిష్టంగా ఉంటుంది. ప్రతిసారీ మనం ఒక పాత విషయాన్ని గుర్తుచేసుకున్నప్పుడు, మెదడు దాన్ని ఉన్నది ఉన్నట్లుగా బయటకు తీసుకురాదు. బదులుగా అందుబాటులో ఉన్న సమాచార శకలాలను, ప్రస్తుత సూచనలను కలిపి ఆ జ్ఞాపకాన్ని పునఃసృష్టిస్తుంది. 

ఈ ప్రక్రియలో కొన్నిసార్లు లోపాలు దొర్లుతాయి. ఫలితంగా అసలు జరగని సంఘటనలు లేదా ఎన్నడూ చూడని వివరాలు కూడా మన జ్ఞాపకాల్లోకి వచ్చి చేరతాయి. వీటినే మనస్తత్వ శాస్త్రవేత్తలు 'ఫాల్స్ మెమొరీస్' లేదా 'తప్పుడు జ్ఞాపకాలు' అని పిలుస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చెప్పే అబద్ధం కాదు, మెదడు పనిచేసే విధానంలో ఇదొక సహజమైన లక్షణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మన మెదడు అనుభవాలను ఎన్‌కోడ్ చేసి, కొంతకాలం పాటు వాటిని స్థిరపరిచి, ఆ తర్వాత తిరిగి గుర్తుచేసుకుంటుంది. 

ఈ క్రమంలో జ్ఞాపకాల్లో ఏర్పడిన ఖాళీలను పూరించడానికి మెదడు తన ఊహలను, ఇతరుల నుంచి అందిన సూచనలను లేదా సంబంధిత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుంది. దీంతో ఆ తప్పుడు జ్ఞాపకం కూడా ఎంతో స్పష్టంగా, నిజంగా జరిగినట్లే అనిపిస్తుంది.

ఈ అంశంపై సైకాలజిస్ట్ ఎలిజబెత్ లోఫ్టస్ చేసిన పరిశోధనలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. 1974లో ఆమె జాన్ పామర్‌తో కలిసి ఒక ప్రయోగం నిర్వహించారు. కొంతమందికి కారు ప్రమాదాల వీడియోలను చూపించి, ఆ వాహనాల వేగం గురించి రకరకాలుగా ప్రశ్నించారు. "కార్లు ఎంత వేగంతో ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి?" అని అడిగినప్పుడు, వారు సగటున గంటకు 40.5 మైళ్ల వేగంతో వెళ్లాయని అంచనా వేశారు. 

అదే సమయంలో "ఒకదానికొకటి తగిలాయి (hit)", "తాకాయి (contacted)" వంటి మెత్తని పదాలు ఉపయోగించి అడిగినప్పుడు, వారు తక్కువ వేగాన్ని అంచనా వేశారు. ఆశ్చర్యకరంగా 'బలంగా ఢీకొన్నాయి' అనే పదాన్ని విన్నవారిలో కొందరు, ఆ వీడియోలో లేకపోయినా పగిలిన అద్దాలను చూసినట్లు కూడా చెప్పారు.

అలాగే, 1995లో జరిగిన మరో అధ్యయనంలో, పరిశోధకులు కొందరికి వారి చిన్ననాటి నాలుగు సంఘటనలను వివరించారు. వాటిలో మూడు నిజమైనవి కాగా, ఒకటి కల్పితమైనది (షాపింగ్ మాల్‌లో తప్పిపోవడం). ఆ తర్వాత వారిలో దాదాపు 25 శాతం మంది, ఆ కల్పిత సంఘటనను కూడా నిజంగా జరిగినట్లు గుర్తుచేసుకోవడం గమనార్హం.

ఇలాంటి జ్ఞాపక వక్రీకరణలకు మన ఊహలు, సంఘటన జరిగిన తర్వాత లభించే తప్పుదోవ పట్టించే సమాచారం, గుర్తుచేసుకునే ప్రక్రియలోని లోపాలు కారణమవుతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడులోని మీడియల్ టెంపోరల్ లోబ్, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ వంటి ప్రాంతాలు నిజమైన, తప్పుడు జ్ఞాపకాల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయని న్యూరోఇమేజింగ్ అధ్యయనాలు గుర్తించాయి.

అయితే, రోజువారీ జీవితానికి అవసరమైనంత వరకు మన జ్ఞాపకాలు చాలావరకు కచ్చితంగానే ఉంటాయి. కానీ, ఒక జ్ఞాపకంపై మనకు పూర్తి విశ్వాసం ఉన్నంత మాత్రాన అది నూటికి నూరు శాతం నిజం కావాలని లేదు. ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, భావోద్వేగాలతో కూడిన సంఘటనల విషయంలో ఈ తప్పుడు జ్ఞాపకాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే కీలకమైన సందర్భాల్లో కేవలం జ్ఞాపకాలపై ఆధారపడకుండా, స్వతంత్రంగా విషయ నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.