కొన్ని రోజుల క్రితం కలిసిన వ్యక్తి పేరు అకస్మాత్తుగా గుర్తుకు రానప్పుడు ఏం చేస్తాం? వెంటనే కళ్లు మూసుకొని, ఆ సంఘటనను మనసులో ఊహించుకుంటాం. కొన్ని క్షణాల్లో ఆ పేరు మెరుపులా మెదులుతుంది. కేవలం పేర్లే కాదు, తాళాలు ఎక్కడ పెట్టామో గుర్తు తెచ్చుకోవడానికైనా, ఎవరితోనైనా జరిగిన సంభాషణను నెమరువేసుకోవడానికైనా మనం చాలాసార్లు ఇదే పని చేస్తాం. మన చుట్టూ ఉన్న పరిసరాలను చూడటం ఆపేసి, కళ్లు మూసుకుంటే సమాధానం దొరుకుతుందనేది మన నమ్మకం.

ఈ చిన్న అలవాటు వెనుక ఒక శాస్త్రీయ వివరణ ఉంది. ఏదైనా విషయాన్ని గుర్తుకు తెచ్చుకునేటప్పుడు కళ్లు మూసుకోవడం వల్ల మెదడుకు అందే అనవసరమైన సమాచారం ఆగిపోతుందని, తద్వారా గతంలో నిక్షిప్తమైన జ్ఞాపకాలపై పూర్తి ఏకాగ్రత పెట్టడం సులువవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మానసిక నిపుణులు ఈ ప్రభావాన్ని ‘ఐ-క్లోజర్ ఎఫెక్ట్’ అని పిలుస్తున్నారు.

ఎలా పనిచేస్తుంది?
మనం కళ్లు తెరిచి ఉన్నప్పుడు, చుట్టూ కదులుతున్న మనుషులు, టేబుల్‌పై వస్తువులు, టీవీలో వచ్చే దృశ్యాలు వంటివన్నీ మన మెదడు నిరంతరం గ్రహిస్తూనే ఉంటుంది. దీనివల్ల మెదడు శక్తి కొంతవరకు ఆ పనులకు వెచ్చించాల్సి వస్తుంది. అదే కళ్లు మూసుకున్నప్పుడు, ఈ దృశ్యపరమైన సమాచారం తాత్కాలికంగా నిలిచిపోతుంది. దాంతో చుట్టూ ఉన్న పరిసరాలను గమనించడానికి అవసరమైన మానసిక శ్రమ తగ్గి, ఆ శక్తిని పూర్తిగా జ్ఞాపకాలను వెలికితీయడానికి ఉపయోగించుకునే అవకాశం మెదడుకు లభిస్తుంది.

ఈ అంశంపై 2011లో జరిగిన ఒక అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 80 మంది ప్రత్యక్ష సాక్షులతో ఒక ప్రయోగం నిర్వహించారు. వీరికి ఒక సంఘటనను చూపించి, ఆ తర్వాత దాని గురించి ప్రశ్నలు అడిగారు. వారిలో కొందరిని కళ్లు మూసుకొని సమాధానాలు చెప్పమని సూచించారు. కళ్లు మూసుకున్న వారు, ఎలాంటి అంతరాయాలు లేని వాతావరణంలో ఉన్నవారు సంఘటనకు సంబంధించిన ఎక్కువ వివరాలను కచ్చితంగా గుర్తు తెచ్చుకోగలిగారని పరిశోధకులు గుర్తించారు. 

ఇది కేవలం దృశ్యపరమైన జ్ఞాపకాలకే పరిమితం కాదు. శబ్ద పరమైన అంతరాయాలు ఉన్నప్పుడు కూడా కళ్లు మూసుకోవడం వల్ల జ్ఞాపకాలు గుర్తుకు వచ్చే సామర్థ్యం మెరుగుపడినట్లు మరో అధ్యయనంలో తేలింది. 2026 ఆగస్టులో ప్రచురితమైన మరో పరిశోధన ప్రకారం, కళ్లు మూసుకోవడం వల్ల వ్యక్తిగత అనుభవాలకు సంబంధించిన జ్ఞాపకాల నాణ్యత కూడా మెరుగుపడుతుంది. అంటే.. ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు మరింత స్పష్టంగా గుర్తుకు వస్తాయి.

కొన్ని ముఖ్యమైన విషయాలు
అయితే, ఏదైనా గుర్తు తెచ్చుకోవడానికి కళ్లు మూసుకోవడం అనేది ఒక సహజమైన ప్రక్రియే తప్ప, దీనివల్ల అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉందని చెప్పలేం. ఇది కేవలం ఏకాగ్రతకు సహాయపడే ఒక మార్గం మాత్రమే. అంతేకాదు, కళ్లు మూసుకోవడం వల్ల గుర్తుకు వచ్చిన ప్రతి విషయం కచ్చితమైనదని గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు మనకు బలంగా గుర్తుకు వచ్చిందని భావించినప్పటికీ, అందులో తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. మెదడులో సరిగ్గా నమోదు కాని సమాచారాన్ని ఈ ప్రక్రియ ద్వారా తిరిగి పొందడం అసాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.