రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో భారత ‘ఏ’ జట్టు ప్రయాణం ముగిసింది. దోహా వేదికగా గురువారం జరిగిన సెమీ ఫైనల్‌లో శ్రీలంక ‘ఏ’ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి ఒకవైపు ఉండగా, భారత యువ పేసర్ హర్షిత్ రాణా తన ప్రవర్తనతో తీవ్ర విమర్శల పాలయ్యాడు.

శ్రీలంక ‘ఏ’తో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. డీప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షాబాజ్ అహ్మద్ బంతిని అందుకోవడంలో కొద్దిగా ఆలస్యం చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన హర్షిత్, సహచర ఆటగాడిపై నోరు పారేసుకున్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అతని తీరుపై అభిమానులు మండిపడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ నేతృత్వంలోని భారత ‘ఏ’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, శ్రీలంక ‘ఏ’ బ్యాటర్లు లసిత్ క్రూస్‌పుల్లే (116), సినెత్ జయవర్ధన (105) సెంచరీలతో చెలరేగి, కేవలం 41.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో శ్రీలంక జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఈ టోర్నమెంట్‌లో హర్షిత్ రాణా మొత్తం నాలుగు మ్యాచ్‌లలో 8 వికెట్లు పడగొట్టినప్పటికీ, 8.35 ఎకానమీ రేటుతో 217 పరుగులు ఇచ్చాడు. నేపాల్‌పై 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం అతని అత్యుత్తమ ప్రదర్శన. కానీ, యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 10 ఓవర్లలో 63 పరుగులు సమర్పించుకున్నాడు. సెమీస్‌లో ఓటమితో భారత్ ‘ఏ’ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.