స్మార్ట్‌ఫోన్‌లో రీల్స్ చేస్తోందన్న కోపంతో కన్నకూతురినే ఓ గిరిజన దంపతులు కర్రతో కొట్టి చంపిన అమానవీయ ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. రవీంద్ర ముర్ము, అతని భార్య సుమనీ దంపతుల కుమార్తె కనకలత ముర్ము (14) ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమె తరచూ మొబైల్ ఫోన్‌లో ఎక్కువ సమయం గడపడం, రీల్స్ చేయడం తల్లిదండ్రులకు నచ్చలేదు. ఈ విషయమై ఈ నెల‌ 10న ఇంట్లో గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, కూతురిని కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ఘోరాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిందితులు ప్రయత్నించారు. కనకలత మృతదేహాన్ని సమీపంలోని పాడుబడిన క్వారీలో పడేశారు. అనంతరం, తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు, గ్రామస్తులకు చెప్పి అందరినీ తప్పుదోవ పట్టించారు. ఈ నెల‌ 13న క్వారీలో బాలిక మృతదేహం లభ్యం కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

మృతదేహం దొరికిన తర్వాత, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రెండు రోజుల పాటు రోడ్లను దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. కుమార్తె మరణం తర్వాత తల్లిదండ్రుల ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగినా, సరైన ఆధారాలు లేకపోవడంతో తొలుత వారిపై చర్యలు తీసుకోలేకపోయారు.

ఒక పోలీస్ అధికారి పీటీఐకి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. టెక్నికల్ ఆధారాలు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ సహాయంతో కీలక సమాచారం సేకరించారు. ఆ తర్వాత తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నేరం అంగీకరించారు. 

మొబైల్ ఫోన్ వాడకం విషయంలోనే గొడవ జరిగిందని, ఆవేశంలోనే కర్రతో కొట్టి చంపామని ఒప్పుకున్నారు. దీంతో కమల్పూర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ధనంజయ్ పాశ్వాన్ నేతృత్వంలోని బృందం నిన్న‌ వారిని అరెస్ట్ చేసింది. ఈ హత్యలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.