ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తండ్రి చనిపోవడంతో ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పాట్నా వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడు, స్పైస్‌జెట్ విమానం గంటల తరబడి ఆలస్యం కావడంతో కన్నీరుమున్నీరయ్యాడు. తనను త్వరగా పంపించాలంటూ ఎయిర్‌లైన్ సిబ్బందిని వేడుకున్న తీరు అక్కడి వారిని కదిలించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు యశ్ దబాస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో, ఆ ప్రయాణికుడు తన తండ్రి చనిపోయారని, దయచేసి తనను గమ్యస్థానానికి చేర్చాలని సిబ్బందిని ప్రాధేయపడటం కనిపించింది. యశ్ దబాస్ కూడా స్పైస్‌జెట్ సిబ్బందిని నిలదీశారు. సరైన సేవలు అందించలేనప్పుడు బుకింగ్‌లు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

ఎస్జీ-709 నంబర్ గల ఈ విమానం వాస్తవానికి మధ్యాహ్నం 1:50 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, దానిని సాయంత్రం 6:30 గంటలకు మార్చారు. ప్రయాణికులు ఎదురుచూస్తుండగానే, ఎయిర్‌పోర్ట్ డిస్‌ప్లేలో బోర్డింగ్ గేట్ మూసివేసినట్లు చూపడంతో గందరగోళం నెలకొంది. దీంతో ఆగ్రహానికి గురైన ఇతర ప్రయాణికులు స్పైస్‌జెట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇటీవలి కాలంలో స్పైస్‌జెట్ సంస్థ కార్యాచరణ సవాళ్లను ఎదుర్కొంటోంది. తరచూ విమానాలు రద్దు కావడం, ఆలస్యమవడం వంటి ఘటనలతో ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ తాజా ఘటనతో సంస్థ జవాబుదారీతనంపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.