జర్మనీకి చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఎస్ఏపీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కనీసం 10,000 ఉద్యోగాలను తగ్గించే ప్రతిపాదనను కంపెనీ పరిశీలిస్తున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్’ నివేదిక వెల్లడించింది. ఇది కంపెనీ మొత్తం సిబ్బందిలో సుమారు 9 శాతంతో సమానం.

సీఈవో క్రిస్టియన్ క్లైన్ నేతృత్వంలో, కంపెనీ తన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లలో ఏఐ టెక్నాలజీని మరింతగా అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐ ఆధారిత ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వ్యాపారాన్ని మార్చడం, అదే సమయంలో ఖర్చులను నియంత్రించడం ఈ పునర్‌వ్యవస్థీకరణ ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రొడక్ట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాలపై ఎక్కువగా దృష్టి సారించినట్లు సమాచారం.

ఏఐ అభివృద్ధికి నిధులను మళ్లించేందుకు ఎస్ఏపీ ఇప్పటికే కొన్ని కఠిన చర్యలు చేపట్టింది. జులైలోనే ఏఐ సంబంధిత పోస్టులు మినహా కొత్త నియామకాలను నిలిపివేసింది. ఇదే సమయంలో కంపెనీ ఉన్నత స్థాయిలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రొడక్ట్ హెడ్, సేల్స్ హెడ్ వంటి కీలక అధికారులు సంస్థను వీడుతుండటం ఈ మార్పులకు సంకేతంగా నిలుస్తోంది.

గడిచిన మూడేళ్లలో ఎస్ఏపీకి ఇది రెండో పెద్ద పునర్‌వ్యవస్థీకరణ కానుంది. 2024 జనవరిలో ప్రకటించిన లేఆఫ్‌ల ద్వారా దాదాపు 9,000 నుంచి 10,000 ఉద్యోగాలను తగ్గించారు. ప్రపంచవ్యాప్తంగా 1.10 లక్షల మంది ఉద్యోగులున్న ఎస్ఏపీ.. సాధారణంగా తన పూర్తి వార్షిక ఫలితాలతో పాటు జనవరి చివరిలో ఇలాంటి కీలక ప్రకటనలు చేస్తుంటుంది. దీంతో త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.