కొత్త ఏడాదిలో విలాసవంతమైన ‘ఆడీ’ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కస్టమర్ల జేబులకు మరింత భారం పడనుంది. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ‘ఆడీ ఇండియా’ తమ కార్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పెరిగిన ముడిసరకు ఖర్చులు, దీర్ఘకాలిక వ్యాపార మనుగడ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ పెరిగిన కొత్త ధరలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఆటోమొబైల్ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తట్టుకునేందుకే ఈ స్వల్ప ధరల పెంపు చేపట్టినట్లు ఆడీ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ స్పష్టం చేశారు. పెరిగిన వ్యయాలకు అనుగుణంగా గరిష్ఠంగా 2 శాతం వరకు ధరలను సవరిస్తున్నామని తెలిపారు. కస్టమర్లకు అందించే ప్రీమియం అనుభూతిలో ఎలాంటి రాజీ పడకుండా, బ్రాండ్‌పై నమ్మకాన్ని నిలబెట్టేందుకే ప్రాధాన్యం ఇస్తామని వివరించారు.

దేశీయ ఆటోమొబైల్ రంగంలో తయారీ, నిర్వహణ ఖర్చులు తడిసిమోపెడవుతుండటంతో ఇతర దిగ్గజ సంస్థలు సైతం ఇప్పటికే బాదుడు మొదలుపెట్టాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎంపిక చేసిన మోడళ్లపై సగటున 0.31 శాతం వరకు ధరలను పెంచింది. ఈ పెరిగిన రేట్లు నవంబర్ 22 నుంచే అమల్లోకి వచ్చాయి. 2026 సెప్టెంబర్‌లో కూడా మారుతి ఎంపిక చేసిన కార్లపై రూ.20 వేల వరకు పెంచింది. మరోవైపు టాటా మోటార్స్ సైతం తమ వాణిజ్య వాహనాలపై అక్టోబర్ 1 నుంచి 1 శాతం వరకు ధరలను పెంచిన సంగతి తెలిసిందే.