భారత్, నేపాల్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలు మరింత బలపడ్డాయి. నేపాల్ అభివృద్ధికి, పునర్నిర్మాణానికి మద్దతుగా నిలుస్తూ భారత ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. నేపాల్ ప్రధాని బాలేన్ షాతో న్యూఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం, ప్రధాని నరేంద్ర మోదీ రూ.24,000 కోట్ల నేపాలీ రూపాయల (సుమారు రూ.15,000 కోట్లు) అభివృద్ధి ప్యాకేజీని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

నేపాల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక బాలేన్ షా భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "భారత్, నేపాల్ కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాదు. మన బంధం విశ్వాసం, స్నేహంతో ముడిపడి ఉంది. కష్టసుఖాల్లో ఒకరికొకరం అండగా నిలుస్తాం" అని అన్నారు. 

నేపాల్ యువత ఆశలు, ఆకాంక్షలకు బాలేన్ షా నాయకత్వం నిదర్శనమని, ఆయన దార్శనికతను ప్రశంసించారు. రెండు దేశాల మధ్య రోడ్, రైల్, సరిహద్దు కనెక్టివిటీని మరింత పెంచాలని నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. ఇటీవల నేపాల్‌ను అతలాకుతలం చేసిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

ఈ సందర్భంగా నేపాల్ ప్రధాని బాలేన్ షా మాట్లాడుతూ.. భారత్ అందించిన ఆత్మీయ ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. "భారత్, నేపాల్ బంధం హిమాలయాలంత దృఢమైనది, సముద్రమంత విశాలమైనది. మన మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మాటల్లో వర్ణించలేం. కష్టకాలంలో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో భారత్ ఎల్లప్పుడూ మాకు అండగా నిలుస్తుంది. అందుకు భారత ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని అన్నారు. అనంతరం ఆయన ప్రధాని మోదీని నేపాల్ పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య 8 కీలక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) జరిగాయి. సివిల్ సర్వీస్ సామర్థ్య శిక్షణ, అంతరిక్ష పరిశోధన, ఆరోగ్యం, వైద్యం, పట్టణాభివృద్ధి, ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యం వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందాలు కుదిరాయి. 

దీంతో పాటు ఇంధనం, కనెక్టివిటీకి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను ఇరు దేశాల ప్రధానులు సంయుక్తంగా ప్రారంభించారు. కొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేశారు. 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానంలో భాగంగా చమురు సరఫరాలో సవాళ్లు ఎదురైనప్పటికీ నేపాల్‌కు ఇంధనం, ఎరువులు, ఇతర నిత్యావసరాలను నిరంతరాయంగా అందించామని మోదీ గుర్తుచేశారు.