ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీలోని సాకేత్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడ‌బ్ల్యూ) జారీ చేసింది. ఎనిమిదేళ్ల క్రితం దాఖలైన పరువునష్టం కేసులో విచారణకు పదేపదే గైర్హాజరు కావడంతో కోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 3కి వాయిదా వేసింది.

వికాస్ సాంకృత్యాయన్ అలియాస్ వికాస్ పాండే అనే వ్యక్తి ఈ పరువునష్టం కేసును దాఖలు చేశారు. 'బీజేపీ ఐటీ సెల్ పార్ట్ 2' పేరుతో ధ్రువ్ రాఠీ రూపొందించిన వీడియో తన ప్రతిష్ఠ‌కు భంగం కలిగించిందని 'ఐ సపోర్ట్ నరేంద్ర మోదీ' అనే సోషల్ మీడియా పేజీ వ్యవస్థాపకుడైన వికాస్ పాండే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలో పలుమార్లు సమన్లు జారీ చేసినా, బెయిలబుల్ వారెంట్లు ఇచ్చినా ధ్రువ్ రాఠీ కోర్టుకు హాజరుకాలేదు. ప్రస్తుతం ఆస్ట్రియాలో నివసిస్తున్న రాఠీకి సమన్లు అందించడం కష్టంగా మారింది. ఆయన దేశంలో లేకపోవడం వల్లే కేసు విచారణ ఆలస్యమవుతోందని ఫిర్యాదుదారు వాదిస్తున్నారు.

2018లో ఇదే వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా రీట్వీట్ చేశారు. అయితే, ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఈ విషయంపై విచారణ జరిగినప్పుడు, ఆ వీడియోను షేర్ చేసి తాను పొరపాటు చేశానని కేజ్రీవాల్ అంగీకరించడం గమనార్హం. ఇప్పుడు ధ్రువ్ రాఠీ కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.