ముంబైలో తనపై జరిగిన కాల్పుల ఘటన తర్వాత బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ తొలిసారిగా బహిరంగ వేదికపై కనిపించారు. ముంబైలో ఘనంగా నిర్వహించిన 'గ్లోబల్ పీస్ హానర్స్ 2026' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన అద్భుతమైన నృత్యంతో ప్రేక్షకులను అలరించారు. 'దేవా శ్రీ గణేశా' పాటకు స్టేజీపై ఆయన చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో ఎరుపు రంగు ధోతీ తరహా ప్యాంటు, మెటాలిక్ ఆర్మ్ కఫ్స్, ఆభరణాలతో టైగర్ ష్రాఫ్ ప్రత్యేకమైన లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రదర్శన అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన అర్ధాంగి అమృతా ఫడ్నవీస్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ స్టేజీపైకి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఈ షోను ప్రారంభించే అవకాశాన్ని మరోసారి తనకు కల్పించినందుకు సీఎం దంపతులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని టైగర్ పేర్కొన్నారు.

అక్టోబర్ 18 సాయంత్రం ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఫుట్‌బాల్ గ్రౌండ్ నుంచి టైగర్ ష్రాఫ్ కారులో బయలుదేరుతుండగా దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆయన కారును లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. ఈ ప్రమాదం నుంచి టైగర్ ష్రాఫ్ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడగా, ఆయన కారు డ్రైవర్ గాయపడ్డారు. ఆ భయానక ఘటన తర్వాత దాదాపు నెల రోజుల పాటు టైగర్ ష్రాఫ్ బయట ఎక్కడా కనిపించలేదు.

ఇటీవలే సోషల్ మీడియాలోకి కూడా రీఎంట్రీ ఇచ్చిన టైగర్, తన తాజా పాట “తేను లేకే జానా” టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ పోస్ట్‌పై ఆయన సోదరి కృష్ణా ష్రాఫ్ స్పందిస్తూ "హి ఈజ్ బ్యాక్" అంటూ కామెంట్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే, కరణ్ జోహార్ నిర్మాణంలో రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తున్న 'లగ్ జా గలే' చిత్రంలో టైగర్ ష్రాఫ్ నటిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్, లక్ష్య లాల్వానీ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా 2027 మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రెమో డిసౌజాతో కలిసి టైగర్ మరో సినిమా చేస్తున్నారు.