సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ తన ఉదారతతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో వివాహం సందర్భంగా సన్ గ్రూప్ ఉద్యోగులకు ఆమె బంగారు ఉంగరాలను కానుకగా అందించినట్లు సమాచారం. ఈ మేరకు ఉద్యోగులు బహుమతులు అందుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఉద్యోగులకు ఇచ్చిన ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌లలో పెళ్లి ఆహ్వాన పత్రికతో పాటు చాక్లెట్లు, బంగారు ఉంగరాలు ఉన్నట్లు వైరల్ వీడియో ద్వారా తెలుస్తోంది.

సాధారణంగా బంగారం నాణేలు ఇస్తారని తాము భావించామని, కానీ నేరుగా బంగారు ఉంగరాలే అందించడంతో ఆశ్చర్యపోయానని ఓ ఉద్యోగి ఆ వీడియోలో ఆనందం వ్యక్తం చేశారు. ఆ గిఫ్ట్ బాక్స్‌లోని ఆహ్వాన పత్రికలో నవంబర్ 25న మధ్యాహ్న విందు ఉన్నట్లు రాసి ఉంది. నవంబర్ 21న చెన్నైలో రిసెప్షన్ జరగనుండగా, ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఆ విందును ఏర్పాటు చేశారా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ బంగారు ఉంగరాల బరువు, విలువపై ఇంకా సమాచారం తెలియరాలేదు. అలాగే ఎంతమంది ఉద్యోగులకు ఈ కానుకలు అందాయనే అంశంపై సన్ గ్రూప్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే మారన్ కుటుంబం చూపిన ఈ ఔదార్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నవంబర్ 11న గ్రీస్ దేశంలో కావ్య మారన్, అనిరుధ్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. కాగా శనివారం చెన్నైలో జరగనున్న వీరి వెడ్డింగ్ రిసెప్షన్‌కు సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరుకానున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ ఇప్పటికే కుటుంబంతో సహా చెన్నై చేరుకున్నారు. అలాగే షారుక్ ఖాన్, కమల్ హాసన్, అల్లు అర్జున్, అజిత్ కుమార్ వంటి అగ్ర నటులు కూడా ఈ విందుకు ఆహ్వానితుల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.