రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉంచిన ట్రక్కును భక్తులతో వెళ్తున్న వాహనం బలంగా ఢీకొనడంతో  తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు తెలిసింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

నాటా పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటా-ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై ఉన్న శంభుపుర గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితులు సికార్ జిల్లాలోని ఖాటూ శ్యామ్ జీ ఆలయాన్ని దర్శించుకుని మహారాష్ట్రకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వాహనం వేగంగా వచ్చి ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఆరుగురిని కోటాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గతంలో బార్మర్ వద్ద డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న డంపర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఓపెన్ జైలు ఖైదీలు మరణించారు. అలాగే ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఖాటూ శ్యామ్ ఆలయానికి వెళ్తున్న మధ్యప్రదేశ్ భక్తుల వాహనం లోయలో పడి ఎనిమిది మంది మృతి చెందారు.