నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు  ఈరోజు (ఆదివారం), రేపు (సోమవారం) ఆయన ఇక్కడ పర్యటించనున్నారు. 2026 మార్చిలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బలేంద్ర షా చేపడుతున్న తొలి విదేశీ, ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం గమనార్హం.

ఈ పర్యటనలో భాగంగా బలేంద్ర షా రేపు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఇరు దేశాల ప్రధానులు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించిన అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడతారు. ఈ సందర్భంగా నేపాల్ ప్రతినిధి బృందానికి ప్రధాని మోదీ అధికారిక విందు ఇవ్వనున్నారు.

బలేంద్ర షాతో పాటు ఆ దేశ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే, విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్‌తో కూడిన 34 మంది సభ్యుల ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఈ పర్యటనలో పాల్గొంటోంది. వాణిజ్యం, రవాణా, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ వంటి కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి. అలాగే, ఇప్పటికే పూర్తయిన కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను ఇరు దేశాల ప్రధానులు సంయుక్తంగా ప్రారంభించనున్నారు.

చారిత్రక, సాంస్కృతిక సంబంధాల పునాదిపై ఇరు దేశాల మధ్య మైత్రి కొనసాగుతోందని, భారత్ అనుసరిస్తున్న 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానంలో భాగంగానే ఈ పర్యటన జరుగుతోందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. తన పర్యటన ముగించుకుని బలేంద్ర షా రేపు రాత్రికి తిరిగి కఠ్మాండుకు బయలుదేరనున్నారు.