ఏపీలో రైల్వే నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో మూడు అత్యంత ముఖ్యమైన కొత్త రైల్వే మార్గాల నిర్మాణానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. మార్కాపురం–శ్రీశైలం–సికింద్రాబాద్, రాజంపేట–నెల్లూరు, సామర్లకోట–చింతూరు మార్గాల్లో ఈ కొత్త లైన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 

ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన మద్దతు తెలుపుతూ రైల్వే శాఖకు లేఖలు రాసింది. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే, ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్), సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

గిరిజన ప్రాంతాలకు, మూడు రాష్ట్రాలకు ప్రయోజనం
సామర్లకోట నుంచి జగ్గంపేట, రంపచోడవరం, మారేడుమిల్లి మీదుగా చింతూరు వరకు సుమారు 150 కిలోమీటర్ల మేర కొత్త లైన్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మార్గం పూర్తయితే ఇప్పటివరకు రైలు సౌకర్యం లేని ఏజెన్సీ ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ లభిస్తుంది. ఇప్పటికే ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి చింతూరు మీదుగా తెలంగాణలోని భద్రాచలం వరకు 173 కిలోమీటర్ల లైన్‌కు ఆమోదం లభించింది. 

ఈ రెండు మార్గాలు అనుసంధానమైతే ఏపీ, ఒడిశా, తెలంగాణ మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కాకినాడ పోర్టుకు బొగ్గు, ఇనుప ఖనిజం రవాణా సులభతరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

శ్రీశైలానికి ప్రత్యక్ష రైలు మార్గం
మరో కీలక ప్రతిపాదన మార్కాపురం నుంచి శ్రీశైలం మీదుగా సికింద్రాబాద్ వరకు సుమారు 290 కిలోమీటర్ల రైల్వే లైన్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి ప్రస్తుతం నేరుగా రైలు సౌకర్యం లేదు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే తెలంగాణ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్ మీదుగా, ఏపీ, దక్షిణాది రాష్ట్రాల నుంచి మార్కాపురం మీదుగా భక్తులు నేరుగా రైలులో శ్రీశైలం చేరుకోవచ్చు. ఇది పర్యాటక, వాణిజ్య రంగాలకు ఊతమిస్తుంది.

కోస్తా, రాయలసీమ మధ్య తగ్గునున్న దూరం
రాజంపేట నుంచి నెల్లూరు వరకు 120 కిలోమీటర్ల మేర మరో కొత్త రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. ప్రస్తుతం రాజంపేట నుంచి నెల్లూరు వెళ్లాలంటే రేణిగుంట మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఈ కొత్త లైన్‌తో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు సరకు రవాణా కూడా సులభతరం అవుతుంది. ఈ మూడు ప్రతిపాదనలు ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనలో ఉన్నాయి. వీటికి అనుమతులు లభించి, నిధులు మంజూరైతే రాష్ట్రంలో రైల్వే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయం.