గణిత శాస్త్రంలో దాదాపు 167 ఏళ్లుగా పరిష్కారం దొరకని అత్యంత ప్రసిద్ధ ‘రీమాన్ హైపోథీసిస్’ (Riemann hypothesis) చిక్కుముడిని విడదీసినట్లు ఇద్దరు గణిత శాస్త్రవేత్తలు వేర్వేరుగా ప్రకటించారు. వీరిలో ఒకరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఈ ఘనత సాధించగా, మరొకరు సొంత ఆలోచనలు, మానవ మేధస్సుతోనే దీనిని నిరూపించామని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌కు చెందిన గణిత నిపుణుడు లెవెంట్ అల్పోగే, క్లాడ్ ఏఐ మోడల్ సాయంతో రీమాన్ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నట్లు తెలిపారు. దాదాపు 17.4 మిలియన్ లైన్ల ‘లీన్’ (Lean) కోడ్‌తో కూడిన ఆర్కైవ్‌ను ఆయన విడుదల చేశారు. ఈ పరిశోధన ఇప్పటికే కంప్యూటర్ ఆధారిత ధ్రువీకరణ పరీక్షలను విజయవంతంగా అధిగమించింది. మరోవైపు, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకుడు అలెశాండ్రో మారియా మసుల్లో ఎలాంటి ఏఐ సాంకేతికత ఉపయోగించకుండా జనరలైజ్డ్ రీమాన్ హైపోథీసిస్‌కు పరిష్కారం చూపినట్లు ప్రకటించారు. అయితే, మసుల్లో డ్రాఫ్ట్‌ను పరిశీలించిన పలువురు నిపుణులు కొన్ని సందేహాలు లేవనెత్తారని, వీటిని నివృత్తి చేయాల్సి ఉందని స్టాన్‌ఫోర్డ్ ప్రొఫెసర్ రవి వకీల్ పేర్కొన్నారు.

జర్మన్ గణిత శాస్త్రవేత్త బెర్న్‌హార్డ్ రీమాన్ 1859లో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కేవలం తమతో మరియు 1తో మాత్రమే భాగించబడే ప్రైమ్ నంబర్లు (ప్రధాన సంఖ్యలు) వచ్చే విధానాన్ని రీమాన్ జీటా ఫంక్షన్ ద్వారా వివరించడమే దీని ముఖ్య ఉద్దేశం. క్లే మ్యాథమెటిక్స్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొన్న ఏడు ప్రధాన గణిత సవాళ్లలో ఇది ఒకటి. అయితే, ఈ పరిశోధనలను శాస్త్రవేత్తలు జర్నల్స్‌లో ప్రచురించిన తర్వాత కనీసం రెండేళ్ల పాటు లోతుగా సమీక్షించనున్నారు. నిపుణులందరి ఆమోదం పొందిన తర్వాతే ఈ పరిష్కారానికి అధికారిక గుర్తింపు లభిస్తుంది.