భారతీయులకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వీసా రహిత ప్రయాణ సదుపాయాన్ని మలేషియా ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2027 జనవరి 1 నుంచి భారతీయులు ఆ దేశంలోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా వీసా తీసుకోవాల్సి ఉంటుందని మలేషియా ఇమిగ్రేషన్ విభాగం స్పష్టం చేసింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం భారతీయులు వీసా లేకుండానే మలేషియాలో 30 రోజుల వరకు పర్యటించవచ్చు. అయితే, ఈ గడువు 2026 డిసెంబర్ 31తో ముగియనుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, 2027లో మలేషియా వెళ్లాలనుకునే వారు 2026 డిసెంబర్ 1 నుంచే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక 'MyVISA' పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

వీసా రహిత ప్రయాణ సదుపాయం దుర్వినియోగం అవుతుండటమే మలేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పర్యాటక వీసాపై వచ్చి అక్రమంగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య పెరిగిందని కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ ఇప్పటికే హెచ్చరించింది. ఏజెంట్ల నకిలీ హామీల వల్ల భారతీయులు అక్కడ నిర్బంధం, దోపిడీ వంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

30 రోజుల వీసా రహిత ప్రయాణం కేవలం పర్యాటక అవసరాలకేనని, ఉద్యోగాల కోసం కాదని అధికారులు తేల్చిచెప్పారు. మలేషియా పర్యటనకు వెళ్లేవారు కనీసం ఆరు నెలల గడువు ఉన్న పాస్‌పోర్ట్, రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే, ప్రయాణానికి మూడు రోజుల ముందు మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్ (ఎండీఏసీ)ను ఆన్‌లైన్‌లో సమర్పించడం తప్పనిసరి.