ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న నైల్ హిప్పోపొటామస్ 'ఫియోనా' కన్నుమూసింది. అమెరికాలోని సిన్సినాటి జూలో 9 ఏళ్ల ఫియోనా గురువారం మృతి చెందినట్లు జూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఓ సందర్శకుడి టోపీని ప్రమాదవశాత్తూ మింగడంతో తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా అది ప్రాణాలు విడిచింది. ఫియోనాను కాపాడేందుకు వెటర్నరీ వైద్యులు, జంతు సంరక్షక బృందాలు చేసిన తీవ్ర ప్రయత్నాలు ఫలించలేదు.

ఈ నెల 8వ తేదీన ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. హిప్పో ఎన్‌క్లోజర్ వద్ద ఓ సందర్శకుడు గాలిలోకి తన ఉన్ని టోపీని విసరగా, అది అక్కడున్న ఫ్యాన్‌కు తగిలి లోపల పడిపోయింది. దీన్ని గమనించిన ఫియోనా ఆ టోపీని మింగేసింది. ఇది పూర్తిగా ప్రమాదవశాత్తూ జరిగిందని జూ అధికారులు స్పష్టం చేశారు. అప్పటి నుంచి అస్వస్థతకు గురైన ఫియోనాకు నిపుణుల బృందం నిరంతరం చికిత్స అందించింది. 

హైడ్రేషన్, మందులు ఇవ్వడంతో పాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా పేగుల్లో సమస్యను గుర్తించారు. తొమ్మిది అడుగుల పొడవైన స్కోప్‌తో కొలొనోస్కోపీ కూడా నిర్వహించారు. అయినా టోపీ బయటకు రాకపోవడంతో జీర్ణవ్యవస్థలో అది కదిలేందుకు గుర్రాలకు వాడే వైబ్రేషన్ ప్లేట్‌ను సైతం ఉపయోగించారు. అయితే, హిప్పోకు అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేయడం అత్యంత ప్రమాదకరమని భావించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

2017లో ఫియోనా ఆరు వారాల ముందుగానే జన్మించింది. పుట్టినప్పుడు కేవలం 13 కిలోల బరువుతో, ప్రాణాలతో బయటపడటం కష్టమని అంతా భావించారు. అయితే, జూ సిబ్బంది ప్రత్యేక సంరక్షణతో అది అద్భుతంగా కోలుకుని, పట్టుదలకు ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీంతో ఫియోనాకు అంతర్జాతీయంగా సెలబ్రిటీ హోదా దక్కింది. 2022లో దానికి ఫ్రిట్జ్ అనే తమ్ముడు కూడా పుట్టాడు.

"చివరి వరకు ఫియోనా పోరాడింది. దానిని కాపాడేందుకు మా బృందం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి" అని జూ డైరెక్టర్ డేవ్ జెనికే ఆవేదన వ్యక్తం చేశారు. ఫియోనా మరణవార్త తెలియగానే జూ వెలుపల ఉన్న దాని విగ్రహం వద్ద సందర్శకులు, అభిమానులు పూలు, సంతాప సందేశాలు ఉంచి నివాళులు అర్పిస్తున్నారు. సిన్సినాటి మేయర్ ఆఫ్తాబ్ పురేవాల్ స్పందిస్తూ.. ఫియోనా పట్టుదల, ఆనందానికి ప్రతీక అని కొనియాడారు.