హాంగ్‌కాంగ్‌లో ఒక సీనియర్ సర్జన్ చేసిన తీవ్రమైన పొరపాటు వైద్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. 45 ఏళ్ల మహిళకు గర్భాశయం, ఫాలోపియన్ నాళాలు మాత్రమే తొలగించాల్సి ఉండగా, పొరపాటున ఆమె అండాశయాలను కూడా తొలగించినట్లు చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంగ్‌కాంగ్ మెడికల్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ చియాంగ్ తక్-హాంగ్ అంగీకరించారు. బుధవారం 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' పత్రికతో మాట్లాడుతూ, ఈ పొరపాటుకు తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఎండోమెట్రియల్ సమస్యతో బాధపడుతున్న సదరు మహిళకు శస్త్రచికిత్స అనివార్యమైంది. ఆపరేషన్‌కు ముందు అండాశయాలను తొలగించాలా? వద్దా? అనే విషయంలో ఆమెకు స్పష్టమైన ఎంపిక ఇచ్చారు. అయితే, సర్జరీకి ముందు సమర్పించిన అంగీకార పత్రంలో అండాశయాలను తొలగించవద్దని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ, ఆపరేషన్ సమయంలో సర్జన్ వాటిని తొలగించారు.

శస్త్రచికిత్స అనంతరం తొలగించిన అవయవాలను ఒక నర్సు పరిశీలిస్తున్నప్పుడు, వాటిలో అండాశయాలు ఉండటాన్ని గమనించి వెంటనే సర్జన్‌ను అప్రమత్తం చేశారు. దీంతో ఈ పొరపాటు వెలుగులోకి వచ్చింది.

"ఆపరేషన్ కొంత సంక్లిష్టంగా ఉంది. నేను ఒకే అంశంపై అతిగా దృష్టి సారించడంతో అసలు సర్జికల్ ప్లాన్‌ను విస్మరించాను. జరిగిన తప్పుకు నేనే బాధ్యత వహించాలి" అని ప్రొఫెసర్ చియాంగ్ తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. సర్జన్‌కు తాత్కాలికంగా ఏకాగ్రత లోపించడం వల్లే ఈ పొరపాటు జరిగిందని వివరించింది.

ఈ ఘటన తర్వాత సీయూహెచ్‌కె మెడికల్ సెంటర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆపరేషన్ థియేటర్లలోని స్క్రీన్లపై సర్జికల్ ప్లాన్‌కు సంబంధించిన సూచనలు నిరంతరం కనిపించేలా ఏర్పాట్లు చేసింది. ఉదాహరణకు 'అండాశయాలను కాపాడాలి' వంటి ప్రధాన సూచనలు ఆపరేషన్ పూర్తయ్యే వరకు స్క్రీన్‌పై ప్రదర్శితమవుతాయి. మరోవైపు, ప్రొఫెసర్ చియాంగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే, బాధితురాలు తన తదుపరి చికిత్సను తిరిగి అదే సర్జన్‌తోనే కొనసాగించాలని నిర్ణయించుకోవడం విశేషం.