కెనడాలో 25 ఏళ్ల భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బ్రిటిష్ కొలంబియాలోని లాంగ్లీ ప్రాంతంలో తగలబడుతున్న కారులో అతడి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై హోమిసైడ్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది.

పోలీసుల వివరాల ప్రకారం, అక్టోబర్ 29వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో రావ్లిన్సన్ క్రెసెంట్ ప్రాంతంలో ఓ వాహనం కాలిపోతోందన్న సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పిన తర్వాత వాహనం లోపల మానవ అవశేషాలను గుర్తించారు. అనంతరం మృతుడిని సర్రే నివాసి తుషార్ శర్మగా నిర్ధారించారు.

ఈ ఘటనను అనుమానాస్పద హత్యగా పరిగణిస్తూ పోలీసులు విచారణ చేపట్టారు. కేసు తీవ్రత దృష్ట్యా, కెనడా ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్  దర్యాప్తు బాధ్యతలు స్వీకరించింది. ఫోరెన్సిక్ నిపుణులు, స్థానిక పోలీసుల సహకారంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో తుషార్ శర్మకు ఎలాంటి నేర చరిత్ర లేదని, కెనడాలో అతనికి పెద్దగా పరిచయాలు కూడా లేవని తేలింది. అయినప్పటికీ, ఇది లక్ష్యంగా చేసుకుని చేసిన దాడి (టార్గెటెడ్ ఎటాక్) అని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. హత్య వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు.

తుషార్ మరణానికి ముందు అతడి దినచర్య, కార్యకలాపాలను తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో అధికారులు మాట్లాడుతున్నారు. అతడి గురించి మరింత సమాచారం రాబట్టేందుకు విదేశాల్లో ఉన్న బంధువులను కూడా సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేదా ఘటనకు సంబంధించిన సీసీటీవీ, డాష్‌క్యామ్ ఫుటేజ్ ఉన్నా తమకు సమాచారం అందించాలని ప్రజలను పోలీసులు కోరారు.