దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘ఈఎన్‌ఈ రిపీట్’ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతోంది. అయితే ఈ సినిమాపై సీనియర్ జర్నలిస్ట్ వీఎస్ఎన్ మూర్తి చేసిన పరోక్ష వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీశాయి. ఒక చిత్రాన్ని ప్రశంసిస్తూ, తమ సినిమాను తక్కువ చేసి మాట్లాడటంపై చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇటీవల విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని ప్రశంసిస్తూ జర్నలిస్ట్ వీఎస్ఎన్ మూర్తి ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన.. “కుర్రాళ్ల సినిమా అంటే ఇది.. పిచ్చి గెంతులు, బూతు జోకులు కాదు” అంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన ‘ఈఎన్‌ఈ రిపీట్’ గురించేనంటూ పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

ఈ పరోక్ష విమర్శలపై హీరో విశ్వక్ సేన్ నేరుగా స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. “కుర్రాళ్ల గురించి, వాళ్ల టేస్ట్ గురించి, టెస్టోస్టిరాన్ గురించి అంచనాలు వేసేంత అప్‌డేటెడ్‌గా మీరు ఉన్నారా? అన్నది నా రివ్యూ. ఒక సినిమాను మెచ్చుకోండి.. అంతేగానీ మరో సినిమాను తక్కువ చేసి మాట్లాడకండి. సంస్కారం, మంచితనం అనేవి వయసుతో పాటు పెరగాలి కానీ, తరగకూడదు” అంటూ ఘాటుగా బదులిచ్చారు.

ఒక సినిమాను మెచ్చుకోవడానికి మరో చిత్రాన్ని చిన్నచూపు చూడటం సరైన పద్ధతి కాదంటూ విశ్వక్ సేన్ స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమలో, నెటిజన్లలో జోరుగా చర్చ సాగుతోంది.