పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ బాల్ ట్యాంపరింగ్‌పై చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో తమ జట్టు ఆటగాళ్లు బంతి ఆకారాన్ని మార్చేందుకు (ట్యాంపరింగ్) శాండ్‌పేపర్‌కు బదులుగా కూల్ డ్రింక్ బాటిల్ మూతలను (బాటిల్ క్యాప్స్) ఉపయోగించారని సంచలన విషయాన్ని బయటపెట్టాడు.

ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా తన తాజా ఆత్మకథ 'సబ్ర్'లో 2018 నాటి కేప్‌టౌన్ 'శాండ్‌పేపర్ గేట్' వివాదాన్ని ప్రస్తావించడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. బాల్ ట్యాంపరింగ్ విషయం అప్పట్లో ఆస్ట్రేలియా జట్టు మొత్తానికి తెలుసని, కేవలం కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను మాత్రమే బలిపశువులను చేశారని ఖవాజా తన పుస్తకంలో పేర్కొన్నాడు. ఈ పరిణామంపై స్పందించిన అక్తర్, తన పాత అనుభవాలను నెమరువేసుకుంటూ గతంలో పాకిస్థాన్ జట్టు అనుసరించిన విధానాలను వెల్లడించాడు.

గతంలో ఇంగ్లండ్ పర్యటనల్లో తమ ఆటగాళ్లు బంతిపై గీతలు పెట్టేందుకు శాండ్‌పేపర్‌ను కాకుండా బాటిల్ క్యాప్స్‌ను వాడేవారని అక్తర్ తెలిపాడు. అంతటితో ఆగకుండా బంతులను మార్చడం, ఇతర రకాల అడ్డదారులు తొక్కడం వంటివి కూడా చేసేవారని పేర్కొన్నారు. అయితే ఇదంతా కేవలం ఒకరిద్దరు ఆటగాళ్లే వ్యక్తిగతంగా చేసిన పని కాదని, జట్టు సమష్టి నిర్ణయం మేరకే జరిగేదని వివరించాడు. టెస్టు క్రికెట్‌లో రివర్స్ స్వింగ్ రాబట్టడం అత్యంత కీలకమని, అది లేకపోతే మ్యాచ్‌లు గెలవడం దాదాపు అసాధ్యమని, ఆ కారణంతోనే జట్టు సభ్యులందరి ఆమోదంతో ఇలాంటి చర్యలకు పాల్పడేవారని స్పష్టం చేశాడు.

అదే సమయంలో ఉస్మాన్ ఖవాజా చేసిన ఆరోపణలపైనా అక్తర్ స్పందించాడు. ట్యాంపరింగ్ వ్యవహారం జట్టు మొత్తానికి తెలిసే ఉంటుందన్న ఖవాజా అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పాడు. అయితే నిజాలు బయటపెట్టడం మంచిదే అయినప్పటికీ, ఖవాజా దీనిని ఇప్పుడు ప్రస్తావించిన సమయం సరైనది కాదన్నాడు. దీనివల్ల ఆటలో అనవసర గందరగోళం తలెత్తుతుందని అభిప్రాయపడ్డాడు.

గతంలో తమ జట్టులో ఎవరు ఏ తప్పులు చేశారో తనకు పూర్తిగా తెలిసినప్పటికీ, బహిరంగంగా సహచరుల పేర్లను బయటపెట్టడానికి తాను ఇష్టపడటం లేదని అక్తర్ తేల్చిచెప్పాడు. క్రికెట్‌కు, ముఖ్యంగా పాకిస్థాన్ క్రికెట్‌కు జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని, ఇప్పుడు పాత విషయాలను తవ్వి తీసి కొత్తగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అన్నాడు. ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయడమే క్రికెట్‌కు మంచిదని సూచించాడు. అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలు రివర్స్ స్వింగ్ కోసం గతంలో జట్లు సాగించిన ప్రయోగాలను మరోసారి చర్చనీయాంశంగా మార్చాయి.