ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత విదేశాంగ విధానంపై చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అంతర్జాతీయ బౌగోళిక రాజకీయాల్లో (గ్లోబల్ జియోపాలిటిక్స్) భారత్ ఒక 'సైడ్ ప్లేయర్'గా మారిపోయిందని, ఒకప్పుడు ప్రపంచ వేదికపై స్వతంత్రంగా వ్యవహరించిన దేశం ఇప్పుడు తన ప్రభావాన్ని కోల్పోయిందని ఆయన విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్, చికాగో విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఒకప్పుడు భారత్‌కు జియోపాలిటిక్స్‌పై చాలా లోతైన అవగాహన ఉండేది. మనకు భాగస్వామ్యాలు, సంబంధాలు ఉన్నప్పటికీ, మనకంటూ ఒక సొంత ఆలోచన ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. పాకిస్థాన్ వంటి దేశం అమెరికా, ఇరాన్‌లతో చర్చలు జరుపుతుంటే, భారత్ మాత్రం కీలకమైన అంతర్జాతీయ చర్చల నుంచి దూరంగా ఉండిపోయింది. ఇది ఆశ్చర్యం కలిగిస్తోంది" అని రాహుల్ అన్నారు. 

ప్రధాని మోదీ విదేశాంగ విధానాన్ని ఉద్దేశిస్తూ, ప్రపంచ నేతలతో వ్యక్తిగత స్నేహాల ఆధారంగా అంతర్జాతీయ సంబంధాలు నడవవని చురకలంటించారు. "ఆయన నా స్నేహితుడు అని మోదీ పదేపదే చెబుతారు. కానీ, జియోపాలిటిక్స్‌లో స్నేహానికి ఎవరు విలువ ఇస్తారు? స్నేహం ఆధారంగా విదేశాంగ విధానం నడుస్తుందని మీరు నిజంగా అనుకుంటున్నారా?" అని ప్రశ్నించారు.

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. విదేశీ గడ్డపై మాట్లాడుతూ దేశ ప్రతిష్ఠ‌ను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ మాట్లాడుతూ.. రాహుల్ వ్యాఖ్యలు అత్యంత నిందనీయమైనవని, ఆయన పాకిస్థాన్‌కు చీర్‌లీడర్‌గా, ప్రచారకర్తగా మారారని ధ్వజమెత్తారు. 

"ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అంతర్జాతీయ రాజకీయాలపై కనీస అవగాహన లేదని ఆయన మాటలే రుజువు చేస్తున్నాయి" అని కేశవన్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో ఏకాభిప్రాయాన్ని సాధించే శక్తిగా ఎదుగుతోందని, దీనిని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు.

మరో బీజేపీ నేత ప్రదీప్ భండారీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి పాకిస్థాన్ మీద ఎందుకంత ఆసక్తి అని ప్రశ్నించారు. "ప్రతి అంతర్జాతీయ వేదికపై రాహుల్ ఒక పాకిస్థాన్ ఫ్యాన్ బాయ్‌లా ప్రవర్తిస్తున్నారు" అని ఎద్దేవా చేశారు. రష్యా-ఉక్రెయిన్, ఇరాన్ వంటి దేశాలతో భారత్ విజయవంతంగా దౌత్య సంబంధాలు నెరుపుతోంటే, రాహుల్‌కు మాత్రం పాకిస్థాన్ ఆదర్శంగా కనిపిస్తోందని విమర్శించారు.

ఉగ్రవాదాన్ని ఆపే వరకు పాక్‌తో చర్చలు అసాధ్యం: రాహుల్ గాంధీ 
అయితే, పాకిస్థాన్‌తో చర్చల విషయంలో రాహుల్ గాంధీ తన వైఖరిని స్పష్టం చేశారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్ పూర్తిగా ఆపే వరకు ఆ దేశంతో చర్చలు జరపడం అసాధ్యమని అన్నారు. "మా దేశంలోని అమాయక ప్రజలను చంపుతుంటే మేం పాకిస్థాన్‌తో చర్చలు జరపలేం. ఉగ్రవాదాన్ని ఆపిన మరుక్షణమే చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది" అని వివరించారు. 

అదేవిధంగా, ఇజ్రాయెల్‌తో సంబంధాలపైనా ఆయన మాట్లాడారు. ఇజ్రాయెల్‌తో రక్షణ సహకారం సహా మంచి సంబంధాలు కొనసాగించాలని, అయితే 150 కోట్ల జనాభా ఉన్న భారత్ తన విదేశాంగ విధానాన్ని ఇతరుల ప్రయోజనాల కోసం కాకుండా సొంత ప్రయోజనాల ఆధారంగానే రూపొందించుకోవాలని స్పష్టం చేశారు.