దేశవ్యాప్తంగా అసంపూర్తి గృహ నిర్మాణ ప్రాజెక్టుల కారణంగా ఆర్థికంగా నష్టపోతున్న ఫ్లాట్ల కొనుగోలుదారులకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. బిల్డర్లు, బ్యాంకు అధికారుల మధ్య కుమ్మక్కు ఉందో లేదో తేల్చకుండా, రుణ వాయిదాల (ఈఎంఐ) చెల్లింపు కోసం కొనుగోలుదారులను ఒత్తిడి చేయరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కమర్షియల్ కోర్టులు, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్ఏటీ)లకు సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న రహేజా డెవలపర్స్‌కు చెందిన కృష్ణా హౌసింగ్ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఫ్లాట్లు చేతికి అందకపోయినా, రుణ రికవరీ కోసం ఢిల్లీలోని సాకేత్ కమర్షియల్ కోర్టులో బ్యాంకులు చర్యలు ప్రారంభించడంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా, నిర్మాణ పనుల పురోగతికి అనుగుణంగానే బిల్డర్‌కు బ్యాంకులు రుణాలు విడుదల చేశాయా? లేదా? అన్నది ధ్రువీకరించుకోవడం కోర్టుల ప్రాథమిక బాధ్యత అని ధర్మాసనం స్పష్టం చేసింది.

కొనుగోలుదారుల వైపు పొరపాటు ఉన్నట్లు నిర్దిష్టంగా తేలితే తప్ప, వారిపై ఈఎంఐల చెల్లింపు కోసం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదని బెంచ్ పేర్కొంది. త్రైపాక్షిక ఒప్పందాల ప్రకారం, నిర్మాణ దశలను బట్టి బిల్డర్‌కు నేరుగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో, నిర్మాణం జరగక ముందే బ్యాంకులు నిధులు విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టులు ఏళ్ల తరబడి అసంపూర్తిగా మిగిలిపోతున్నాయి. దీనివల్ల కొనుగోలుదారులు అటు ఇంటి అద్దె, ఇటు ఈఎంఐలు చెల్లిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఈ కేసుతో పాటు, బెంగళూరులో దాదాపు 4,500 మంది హోమ్ బయ్యర్లకు సంబంధించిన మరో కేసులోనూ సుప్రీంకోర్టు ఇటువంటి ఆదేశాలే ఇచ్చింది. అక్కడ కొనుగోలుదారులు 95 శాతం మేర సొమ్ము చెల్లించినా, పదేళ్లుగా ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో వారికి రికవరీ చర్యల నుంచి రక్షణ కల్పించింది. ఇటువంటి వివాదాలపై గతేడాది సెప్టెంబరులో జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దేశవ్యాప్తంగా బిల్డర్లు, బ్యాంకుల తీరుపై సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.