న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను తుది జట్టు నుంచి తప్పించడంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ సితాన్షు కోటక్ స్పష్టతనిచ్చాడు. సిరాజ్ ప్రపంచ స్థాయి బౌలర్ అయినప్పటికీ, పిచ్ పరిస్థితులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు. ఇందులో ఎలాంటి తప్పిదం లేదని అతడు గట్టిగా సమర్థించుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కోటక్.. పేసర్ల ఎంపిక, జట్టు కూర్పు వెనుక ఉన్న వ్యూహాలను వివరించాడు.

అనుభవజ్ఞుడైన సిరాజ్‌ను ఈ మ్యాచ్‌లో పక్కనపెట్టడం తప్పు కాదని కోటక్ స్పష్టం చేశారు. "నా దృష్టిలో ఇది ఏమాత్రం తప్పుడు నిర్ణయం కాదు. జట్టు యాజమాన్యం పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేసి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను బరిలోకి దించింది. ఇటీవల సిరాజ్ శ్రీలంకలో ఆడిన పరిస్థితులు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరు. సిరాజ్‌కు ఎలాంటి సమస్యా లేదు. ఇది కేవలం పరిస్థితుల ఆధారంగా తీసుకున్న నిర్ణయం మాత్రమే" అని పేర్కొన్నారు. 

బేసిన్ రిజర్వ్ పిచ్‌పై దట్టమైన గడ్డి ఉండటం వల్ల వేగం, సీమ్, స్వింగ్ రాబట్టగల కాంబినేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. ఇద్దరు సీమ్ బౌలర్లు, ఇద్దరు స్వింగ్ బౌలర్లు అవసరమనే ఉద్దేశంతోనే ఈ పేస్ దాడిని ఎంచుకున్నామన్నారు. కేవలం తొలి రోజు మాత్రమే కాకుండా ఐదు రోజుల ఆటను దృష్టిలో పెట్టుకుని బౌలర్లను ఎంపిక చేశామని వివరించారు.

యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ వేగం తగ్గడంపై స్పందిస్తూ.. మూడో స్పెల్‌లో కాస్త వేగం తగ్గినా ఆరంభంలో మంచి వేగంతోనే బౌలింగ్ చేశాడని కోటక్ వెనకేసుకొచ్చారు. పిచ్‌పై గడ్డి ఉన్నప్పుడు బంతి నెమ్మదిగా వస్తే బ్యాటర్లకు షాట్లు ఆడే సమయం దొరుకుతుందని, అందుకే పేస్ చాలా కీలకమని పేర్కొన్నారు. 

రవీంద్ర జడేజాను కాదని వాషింగ్టన్ సుందర్‌ను ఏకైక స్పిన్నర్‌గా ఎంపిక చేయడంపై మాట్లాడుతూ.. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌లో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటంతోనే ఆఫ్ స్పిన్నర్ అయిన సుందర్‌కు ప్రాధాన్యమిచ్చినట్లు స్పష్టం చేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలో ప్రత్యర్థిని 70 పరుగులకే 5 వికెట్లతో దెబ్బకొట్టినప్పటికీ, ఆ తర్వాత నికోల్స్, ఫిలిప్స్ జోడిని విడదీయలేకపోవడంతో న్యూజిలాండ్ పుంజుకుంది. తొలిరోజు ఆటముగిసే సమయానికి 82 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసింది.