అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేం. ఫ్రాన్స్‌లో ఓ మహిళ విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. పాత సామాన్ల మార్కెట్‌లో (ఫ్లీ మార్కెట్) సరదాగా కొన్న ఓ దీపం ఆమెను రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసింది. కేవలం 20 యూరోలకు (సుమారు రూ.2000) కొనుగోలు చేసిన ఒక పాత సిరామిక్ దీపం, పారిస్‌లో జరిగిన వేలంలో ఏకంగా 2.51 లక్షల యూరోలు (సుమారు రూ.2.5 కోట్లు) పలికి రికార్డు సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. సుమారు ఏడాది క్రితం ఫ్రాన్స్‌లోని వాలెన్సిన్నెస్ సమీపంలో ఉన్న ఓ సంతలో ఓ మహిళ ఈ నల్ల సిరామిక్ దీపాన్ని చూసింది. ఒకదానిపై ఒకటి పేర్చిన గులకరాళ్ల వంటి విలక్షణమైన ఆకారం, నిగనిగలాడే ఉపరితలం చూసి ఆమె ఆకర్షితురాలైంది. బేరమాడకుండా అడిగిన 20 యూరోలు చెల్లించి దాన్ని ఇంటికి తెచ్చి, ఓ అల్మరాలో పక్కన పడేసింది.

ఇటీవల ఆమె కుమార్తె ఇల్లు శుభ్రం చేస్తుండగా ఈ దీపం మళ్లీ బయటపడింది. దాని అడుగున ఉన్న 'జౌవ్' (Jouve) అనే సంతకాన్ని గమనించి, దాని గురించి ఆన్‌లైన్‌లో వెతకగా అసలు విషయం తెలిసింది. అది 20వ శతాబ్దపు ప్రఖ్యాత ఫ్రెంచ్ సిరామిక్ కళాకారుడు జార్జెస్ జౌవ్ (1910–1964) రూపొందించిన అరుదైన కళాఖండమని వారు గుర్తించారు. వెంటనే పారిస్‌లోని 'నియో ఎన్‌చెరెస్' అనే వేలం సంస్థను సంప్రదించారు.

ఆ సంస్థ నిపుణులు దీన్ని పరిశీలించి, ఇది జౌవ్ అసలైన కళాఖండమేనని, ఎలాంటి డ్యామేజ్ లేకుండా అద్భుతమైన స్థితిలో ఉందని ధ్రువీకరించారు. అక్టోబర్ 29న జరిగిన వేలంలో దీనికి 80,000 నుంచి 1.20 లక్షల యూరోలు వస్తుందని అంచనా వేశారు. అయితే, వేలం ప్రారంభమైన తర్వాత సుమారు పది మంది పోటీపడటంతో ధర అనూహ్యంగా పెరిగింది. 

చివరికి, కొనుగోలు ఫీజులతో కలిపి తుది ధర 2.51 లక్షల యూరోలకు చేరింది. ఇది కొన్న ధర కన్నా 12,000 రెట్లు అధికం. జార్జెస్ జౌవ్ కళాఖండానికి ఇదే ప్రపంచ రికార్డు ధర కావడం విశేషం. ఈ అమ్మకం తర్వాత తమ వివరాలను గోప్యంగా ఉంచాలని ఆ కుటుంబం నిర్ణయించుకుంది.