ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థలు వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్ చేజ్‌కు సైబర్ దాడి సెగ తగిలింది. తమ కస్టమర్లకు సంబంధించిన కొంత సమాచారం బయటకు పొక్కినట్లు ఈ సంస్థలు ధ్రువీకరించాయి. అయితే, ఈ దాడి తమ సొంత సిస్టమ్స్‌పై జరగలేదని, తమకు సేవలు అందించే థర్డ్-పార్టీ సంస్థలే లక్ష్యంగా జరిగిందని స్పష్టం చేశాయి. ఈ ఘటనల వల్ల తమ కోర్ పేమెంట్ నెట్‌వర్క్‌లకు గానీ, చెల్లింపుల వ్యవస్థలకు గానీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదని భరోసా ఇచ్చాయి.

'n0n' అనే రాన్సమ్‌వేర్, దోపిడీ ముఠా ఈ సైబర్ దాడులకు బాధ్యత వహించింది. డబ్బులు చెల్లించేందుకు తాము విధించిన గడువు ముగియడంతో నిన్న‌ కస్టమర్ల డేటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు ఈ గ్రూప్ ప్రకటించింది. లీకైన డేటాలో కస్టమర్ల కార్డు నంబర్లు, లావాదేవీల వివరాలు వంటి అత్యంత కీలకమైన సమాచారం లేదని, కేవలం ఈమెయిల్ చిరునామాలు, పేర్లు, మార్కెటింగ్ లేదా లాయల్టీ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన రికార్డులు మాత్రమే ఉన్నాయని తెలిసింది.

ఆసియా-పసిఫిక్ రీజియన్‌లోని తమ థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌పై ఈ దాడి జరిగిందని వీసా పేర్కొంది. ప్రీమియం డైనింగ్, లాయల్టీ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన వేలాది మంది కార్డుదారుల వివరాలు ఇందులో ఉన్నట్లు సమాచారం. తమ పేమెంట్ సిస్టమ్స్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, కార్డు వివరాలు సురక్షితంగా ఉన్నాయని వీసా తెలిపింది. అదేవిధంగా ఒక నిర్దిష్ట బెనిఫిట్ ప్రోగ్రామ్‌లో ఉన్న కొద్దిమంది కస్టమర్ల ఈమెయిల్ వివరాలు మాత్రమే లీక్ అయ్యాయని, పేమెంట్ నెట్‌వర్క్‌పై దీని ప్రభావం లేదని మాస్టర్‌కార్డ్ వివరించింది.

తమ బయటి వెండర్లపై దాడి జరిగిందని, కస్టమర్ల పేర్లు, ఈమెయిల్స్ వంటి మార్కెటింగ్ డేటా హ్యాకర్ల చేతికి చిక్కినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని జేపీ మోర్గాన్ చేజ్ వెల్లడించింది. కార్డు నంబర్లు లీక్ కాకపోయినప్పటికీ, బహిర్గతమైన ఈమెయిల్స్, పేర్లతో కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని మోసపూరిత 'ఫిషింగ్' దాడులు జరిగే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూడు సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తుండగా, ప్రభావితమైన కస్టమర్లకు అవసరమైన మద్దతు అందిస్తామని హామీ ఇచ్చాయి.