భారత విమానాలు తమ గగనతలాన్ని ఉపయోగించకుండా విధించిన నిషేధాన్ని పాకిస్థాన్ మరోసారి పొడిగించింది. ఈ ఆంక్షలను ఈ ఏడాది డిసెంబర్ 24 వరకు పొడిగిస్తున్నట్లు పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (పీఏఏ) అధికారికంగా ప్రకటించింది.

పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ జారీ చేసిన ‘నోటీస్ టు ఎయిర్‌మెన్’ (నోటమ్) ప్రకారం.. భారత్‌లో రిజిస్టర్ అయిన అన్ని రకాల విమానాలు, భారత విమానయాన సంస్థల యాజమాన్యంలో ఉన్నవి, అవి నడుపుతున్నవి లేదా లీజుకు తీసుకున్న విమానాలతో పాటు భారత సైనిక విమానాల రాకపోకలపై కూడా ఈ నిషేధం వర్తిస్తుంది.

2025 ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడికి పాకిస్థానే కారణమని భారత్ స్పష్టం చేయగా, పాక్ ఆ ఆరోపణలను తిరస్కరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రెండు దేశాలు పరస్పరం గగనతలాలను మూసివేశాయి. ఆ తర్వాత మే 2025లో ఇరుదేశాల మధ్య వైమానిక దాడులు, కాల్పులతో నాలుగు రోజుల పాటు తీవ్ర సైనిక ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ కూడా 2025 ఏప్రిల్ 30న పాకిస్థాన్ విమానాలపై తమ గగనతలాన్ని నిషేధించింది. అప్పటి నుంచి పాకిస్థాన్ ప్రతి నెలా భారత విమానాలపై ఈ ఆంక్షలను పొడిగిస్తూ వస్తోంది. గతంలో 1999 కార్గిల్ యుద్ధం, 2019 పుల్వామా దాడి సమయంలోనూ ఇరుదేశాల మధ్య ఇలాంటి గగనతల ఆంక్షలు అమలయ్యాయి.

పాకిస్థాన్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడుతోంది. భారత విమానయాన సంస్థలు పాక్ గగనతలం మీదుగా వెళ్లే అవకాశం లేకపోవడంతో, ప్రత్యామ్నాయ మార్గాల్లో చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. ముఖ్యంగా పశ్చిమ దేశాలకు వెళ్లే కొన్ని సుదూర సర్వీసుల ప్రయాణ సమయం దాదాపు 3 గంటల వరకు పెరిగే అవకాశముందని ఎయిర్ ఇండియా గతంలోనే వెల్లడించింది. ప్రయాణ సమయం పెరగడంతో పాటు విమానయాన సంస్థలకు ఇంధన భారం కూడా గణనీయంగా పెరిగే పరిస్థితి ఏర్పడింది.