ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తమ చందాదారులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. 55 ఏళ్లలోపు వయసున్న సభ్యులు తమ పీఎఫ్ నిధి నుంచి ఉపసంహరించుకునే (విత్‌డ్రాయల్) పరిమితిని గతంలో ఉన్న 75 శాతం నుంచి ఏకంగా 90 శాతానికి పెంచుతూ ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) గురువారం ఆమోదం తెలిపింది. అంటే ఇకపై ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో కేవలం 10 శాతం నిల్వ ఉంచితే సరిపోతుంది. అత్యవసర ఆర్థిక పరిస్థితుల్లో సభ్యులు తమ పొదుపు మొత్తాన్ని సులభంగా పొందేందుకు ఈ సంస్కరణ దోహదపడనుంది.

దీంతో పాటు ఉద్యోగం కోల్పోయిన వారికి కూడా ఈపీఎఫ్ఓ పెద్ద ఊరట కల్పించింది. గతంలో ఉద్యోగం పోయిన తర్వాత పూర్తి పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు 12 నెలల నిరీక్షణ సమయం ఉండగా, దాన్ని కేవలం 2 నెలలకు కుదించింది. దీనివల్ల ఉపాధి కోల్పోయిన వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ డబ్బును త్వరితగతిన పొందే వెసులుబాటు లభిస్తుంది.

మరో కీలక ముందడుగుగా.. మ్యూచువల్ ఫండ్లలో ఉండే తరహాలోనే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) విధానాన్ని ప్రవేశపెట్టే ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసింది. పదవీ విరమణ పొందిన సభ్యులు తమ మొత్తం పీఎఫ్ నిధిని ఒకేసారి వెనక్కి తీసుకోకుండా, ప్రతి నెలా వాయిదాల రూపంలో (మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్) పెన్షన్ తరహాలో క్రమపద్ధతిలో పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. మిగిలిన మొత్తంపై ఈపీఎఫ్ఓ ద్వారా అధిక వడ్డీ నిరంతరాయంగా లభిస్తూనే ఉంటుంది. ఒకవేళ లబ్ధిదారుడు మరణిస్తే నామినీ ఆ బ్యాలెన్స్‌ను ఒకేసారి ఉపసంహరించుకోవడం లేదా నెలనెలా చెల్లింపులను కొనసాగించే అవకాశాన్ని కల్పించారు.