తమిళనాడు ప్రభుత్వంలో పెట్టుబడుల డేటా లీక్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులకు సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చేరవేశారన్న ఆరోపణలతో సీఎం విజయ్ ప్రభుత్వం 15 మంది సీనియర్ అధికారులను విధుల నుంచి తొలగించింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ ‘గైడెన్స్ తమిళనాడు’లో పనిచేస్తున్న ఈ అధికారులపై అంతర్గత దర్యాప్తు అనంతరం వేటు వేసినట్లు సమాచారం.

తమిళనాడులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం జరిపిన చర్చలు, ఒప్పందాలు, రాయితీలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఈ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలకు చేరవేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. తొలగించబడిన వారిలో ఎక్కువ మంది 2016–2021 మధ్య అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారు. పాలనాపరమైన కొనసాగింపు కోసం గత డీఎంకే ప్రభుత్వం కూడా వీరి సేవలను వినియోగించుకుంది. అయితే, తాజాగా తొలగించిన అధికారుల్లో ముగ్గురు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో చేరుతుండటం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. తమిళనాడుకు రావాల్సిన కొన్ని భారీ ప్రాజెక్టులు ఏపీకి మళ్లడానికి ఈ లీకేజీలే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఎలాంటి సమాచారం బయటకు వెళ్లిందనే దానిపై ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ఆధారాలను బయటపెట్టలేదు.

ఈ పరిణామం తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. విజయ్ ప్రభుత్వ చర్యను డీఎంకే తీవ్రంగా తప్పుబట్టింది. డీఎంకే ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మాజీ మంత్రిగా పనిచేసిన టి.ఆర్.బి. రాజా స్పందిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత అపరిపక్వమైనదని విమర్శించారు. కేవలం సోషల్ మీడియా రాజకీయాల కోసమే, దశాబ్దాలుగా నిర్మించిన అత్యున్నత వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమ ప్రభుత్వం అనుభవజ్ఞులైన అధికారులను కొనసాగించి పారిశ్రామిక ప్రగతిని సాధించిందని, ప్రస్తుత పాలకులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు.

మరోవైపు, ఈ ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తోసిపుచ్చారు. పరిశ్రమల అనుకూల విధానాలు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారానే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ఆకర్షిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల రహస్య సమాచారాన్ని సేకరించో లేక కాపీ కొట్టో పెట్టుబడులు రాబట్టాల్సిన అవసరం ఏపీకి లేదన్నారు. రాష్ట్రాల మధ్య పారిశ్రామిక పోటీ ఎప్పుడూ ఆరోగ్యకరమైన విధానాల ఆధారంగానే సాగాలని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై అటు అధికార టీవీకే గానీ, ఇటు ముఖ్యమంత్రి విజయ్ కార్యాలయం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అత్యంత కీలకమైన పారిశ్రామిక రహస్యాల బదిలీకి సంబంధించిన ఆధారాలు ఎంతవరకు వాస్తవమనేది, ఈ పరిణామం రెండు రాష్ట్రాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.