దాదాపు అర్ధ శతాబ్దం క్రితం సముద్ర తీరంలో అలల తాకిడికి కొట్టుకుపోయిన ఓ విలువైన ఉంగరం, ఊహించని రీతిలో తిరిగి దాని అసలైన యజమాని చేతికి చేరింది. 47 ఏళ్ల పాటు ఇసుక తిన్నెల్లో దాగివున్న ఆ ఉంగరాన్ని గుర్తించడమే కాకుండా, స్వయంగా యజమానికి అందజేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా 3,000 మైళ్లు విమానంలో ప్రయాణించడం విశేషం.

అసలేం జరిగింది?
1979లో అమెరికాలోని రోడ్ ఐలాండ్‌కు చెందిన పాల్ బెన్సన్, సెయింట్ రాఫెల్ అకాడమీలో చదువుకున్న రోజుల్లో జ్ఞాపకంగా తీసుకున్న 'క్లాస్ రింగ్'ను తన సోదరుడు ఎరిక్‌కు ఇచ్చాడు. ఎరిక్ వాషింగ్టన్‌లోని ప్యూజెట్ సౌండ్ బీచ్‌లో స్నేహితులతో సరదాగా గడుపుతూ, ఆ ఉంగరాన్ని తీసి ఓ బండరాయిపై ఉంచాడు. అయితే అనూహ్యంగా వచ్చిన సముద్రపు అలల ధాటికి ఆ ఉంగరం నీటిలో కొట్టుకుపోయింది. భయంతో ఆ విషయాన్ని ఎరిక్ తన సోదరుడికి చెప్పలేకపోయాడు. కాలక్రమంలో ఆ ఉంగరం శాశ్వతంగా సముద్ర గర్భంలో కలిసిపోయిందని భావించాడు.

47 ఏళ్ల తర్వాత లభ్యం
2025 నవంబర్‌లో సియాటిల్‌కు చెందిన మెటల్ డిటెక్టరిస్ట్ లూకాస్ థ్రన్ అదే తీరంలో అన్వేషణ సాగిస్తుండగా ఈ ఉంగరం బయటపడింది. ఆ సమయంలో తీరంలో నీటిమట్టం అసాధారణంగా తగ్గడంతో ఇసుకలో కూరుకుపోయిన ఆ ఉంగరం మెటల్ డిటెక్టర్‌కు చిక్కింది. దానిపై "సెయింట్ రాఫెల్ అకాడమీ" అన్న పేరుతో పాటు "PEB" అనే అక్షరాలు చెక్కి ఉండడాన్ని లూకాస్ గుర్తించాడు.

3,000 మైళ్ల ప్రయాణం.. భావోద్వేగ కలయిక
ఆ ఆధారాలతో లూకాస్ వెంటనే సదరు పాఠశాలను సంప్రదించాడు. పూర్వ విద్యార్థుల రికార్డులను పరిశీలించిన పాఠశాల యంత్రాంగం, ఆ ఉంగరం పాల్ బెన్సన్‌దేనని నిర్ధారించింది. అయితే ఆ అపురూప జ్ఞాపకాన్ని కొరియర్ లేదా పోస్టు ద్వారా పంపడానికి లూకాస్ ఇష్టపడలేదు. సియాటిల్ నుంచి రోడ్ ఐలాండ్‌కు సుమారు 3,000 మైళ్లు ప్రయాణించి, పాల్‌ను స్వయంగా కలిసి ఆ ఉంగరాన్ని చేతికి అందించాడు.

ఈ అపూర్వ ఘట్టం కోసం ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న పాల్ సోదరుడు ఎరిక్ కూడా అక్కడికి చేరుకున్నాడు. తన పాఠశాల రోజులతో పాటు దివంగత తల్లి జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ఆ ఉంగరం తిరిగి చేతికి రావడంతో పాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఎంతో శ్రమకోర్చి ఉంగరాన్ని తీసుకొచ్చి అప్పగించిన లూకాస్ థ్రన్‌ను సెయింట్ రాఫెల్ అకాడమీ తమ గౌరవ సభ్యత్వంతో సత్కరించింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత జరిగిన ఈ అరుదైన ఘటన స్థానికంగా విశేషంగా ఆకట్టుకుంటోంది.