స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ కార్డియాక్ సర్జన్ డయానా రెసెర్.. గుండె ఆకారంలో ఉండే వస్తువులను అత్యధికంగా సేకరించి గిన్నిస్ వరల్డ్ రికార్డును తిరిగి కైవసం చేసుకున్నారు. ఏకంగా 3,200 వస్తువులతో ఆమె ఈ అరుదైన ఘనతను సాధించారు. జ్యూరిచ్ సమీపంలోని జొల్లికాన్‌లో నివసించే ఆమె, ఈ ఏడాది ఏప్రిల్ 13న తన సేకరణను అధికారికంగా లెక్కించి ఈ రికార్డును నెలకొల్పారు.

డయానా ఈ రికార్డును సాధించడం ఇది రెండోసారి. 2010లో 775 వస్తువులతో ఆమె మొదటిసారి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. అయితే, 2024లో అమెరికాకు చెందిన సుసాన్ వెస్ట్ 1,560 వస్తువులతో ఆ రికార్డును బద్దలుకొట్టారు. ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువ వస్తువులను సేకరించిన డయానా, ఆ టైటిల్‌ను మళ్లీ తన సొంతం చేసుకున్నారు. తన ప్రత్యేక విభాగంలో ప్రొఫెసర్‌గా టైటిల్ అందుకున్న మొదటి స్విస్ మహిళగా కూడా డయానా గుర్తింపు పొందడం విశేషం.

సుమారు 25 ఏళ్ల క్రితం, వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు డయానాకు ఈ ఆసక్తి మొదలైంది. హార్ట్ సర్జరీని తన ప్రత్యేకతగా ఎంచుకున్న తర్వాత స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెకు గుండె ఆకారంలో ఉన్న బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె కూడా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ఇలాంటి వస్తువులను సేకరించడం మొదలుపెట్టారు. ఆమె సేకరణలో సగం బహుమతులు కాగా, మిగిలిన సగం ఆమె స్వయంగా కొనుగోలు చేసినవే.

ఆమె సేకరణలో సబ్బులు, నగల పెట్టెలు, దుస్తులు, కార్ ఎయిర్ ఫ్రెషనర్ల వంటి రోజువారీ వస్తువులతో పాటు కొన్ని అరుదైనవి కూడా ఉన్నాయి. వాటిలో గుండె ఆకారంలో ఉన్న రూబిక్స్ క్యూబ్, పనిచేసే స్టెతస్కోప్, బెర్లిన్ గోడకు చెందిన ఓ ముక్క, తన సోదరి గీసిన గుండె ఆకారపు ముఖం ఉన్న గుడ్లగూబ పెయింటింగ్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా, డయానా తన శరీరంపై ఆరు గుండె ఆకారపు టాటూలను కూడా వేయించుకున్నారు. "గుండె సర్జరీపై ఉన్న ఆసక్తి, అలాగే మన రోజువారీ జీవితంలో గుండె ఆకారం ఎంతగా కలిసిపోయిందనే విషయం నన్ను ఈ సేకరణ వైపు నడిపించాయి" అని డయానా తెలిపారు.